లాఠీచార్జిపై నేతల ధ్వజం | leaders object on baton charge | Sakshi
Sakshi News home page

లాఠీచార్జిపై నేతల ధ్వజం

Published Sat, Jul 30 2016 9:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్‌

సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్‌

  • ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం
  • ఆగస్టు 1 నుంచి  మేధావులతో చర్చా వేదికలు
  • సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్‌
  • గజ్వేల్‌ రూరల్‌: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జీలు చేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భూనిర్వాసితుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్‌ ఆరోపించారు.

    శనివారం గజ్వేల్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు హరీష్‌రావు ఏజెంట్లలా తయారయ్యారన్నారని ఆరోపించారు. తాము సిద్దిపేట సబ్‌జైల్లో ఉన్న మల్లేష్‌ను పలుకరించడం జరిగిందని.. అతన్ని హైదరాబాద్‌లో అరెస్టు చేసి గజ్వేల్‌ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పేర్కొనడం సమంజసం కాదన్నారు.

    మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం బ్రిటీష్ కాలంలో జలియన్‌వాలా బాగ్‌ ఉద్యమాన్ని తలపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పాలనలో హరీష్‌రావు హిట్లర్‌ వారసత్వం పుణికిపుచ్చుకున్నట్లు ప్రజాపోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

    ముంపు బాధిత రైతులంతా స్వచ్ఛందంగా ప్రాజెక్టు నిర్మాణానికి భూములిస్తున్నారని గోబెల్‌ ప్రచారం నిర్వహిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా 30 శాతానికి మించి రైతులు భూములివ్వలేదన్నారు. బ్రిటీష్‌ కాలంలో అభివృద్ధి పేరుతో దోచుకోగా... నేడు అభివృద్ధి పేరుతో భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు.

    ‘మల్లన్నసాగర్‌’ ప్రాజెక్టుకు హరీష్‌రావే కథానాయకుడని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని... ప్రజలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. ముంపు గ్రామాల్లో  స్వచ్ఛందంగా భూములిస్తున్నట్లు వారిచే చెప్పిస్తే తాము దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు.

    123 జీవో వచ్చి నేటికి సరిగ్గా ఏడాది గడిచిందని. ఈ జీవోతో ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. భూములు తీసుకున్న వారికి ఏ ఒక్క కుటుంబానికైనా రూ. 5లక్షల ఉపాధి పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. 123 జీవోకు వ్యతిరేకంగా 150 కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. 

    2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మల్లన్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న లాయర్లపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఆగస్టు 1 నుంచి భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేధావులచే చర్చా వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌రెడ్డి, నాయకులు సాగర్‌, వెంకటేష్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement