‘ప్రయోగం’లోనే ఎల్‌ఈడీ | led not implement karminagar | Sakshi
Sakshi News home page

‘ప్రయోగం’లోనే ఎల్‌ఈడీ

Published Fri, Aug 19 2016 7:52 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

‘ప్రయోగం’లోనే ఎల్‌ఈడీ

‘ప్రయోగం’లోనే ఎల్‌ఈడీ

  • ఆరు నెలలైనా ముందుకు కదలని ప్రాజెక్ట్‌
  • ఐదు డివిజన్లకే పరిమితమైన బల్బులు
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌:  విద్యుత్‌ ఆదాతోపాటు నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు కరీం‘నగరం’లో ఎల్‌ఈడీ లైట్ల బిగింపునకు శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా మెుదలుపెట్టిన లెడ్‌ లైట్ల బిగింపు ఇంకా అదే స్థాయిలోనే ఉండడం గమనార్హం. ప్రయోగాలను దాటకపోవడంతో నగరవాసులకు లెడ్‌ వెలుగులు పూర్తిస్థాయిలో అందడం లేదు.

    కరీంనగర్‌ నగరపాలకసంస్థలో ఎల్‌ఈడీ(లెడ్‌) బల్బులు ఆరు నెలలు గడిచినా ప్రయోగ దశలోనే ఉన్నాయి. మొదటి దఫా ప్రయోగాత్మకంగా 16, 22, 23వ డివిజన్లలో మెజారిటీ ఏరియాల్లో, 24, 25 డివిజన్లలో ఒక్కో లైన్‌కింద గత ఫిబ్రవరిలో 328 లెడ్‌ బల్బులు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) బిగించింది. తర్వాత దశలవారీగా నగరంలోని అన్ని డివిజన్లలో బిగిస్తామని చెప్పినా ఒక్క అడుగు ముందుకు పడలేదు.


    అంతా హడావుడే..
    విద్యుత్‌ పొదుపుతోపాటు వీధిదీపాల నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు లెడ్‌ వీధి దీపాలు బిగించుకోవాలని ప్రభుత్వం మున్సిపాలిటీలను ఆదేశించింది. ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. దీంతో నగరంలో లెడ్‌ లైట్లు బిగించేందుకు ఈఈఎస్‌ఎల్‌ సంస్థ 16, 17, 22, 23, 24 డివిజన్లలో వరుసగా ఉండే స్తంభాలను గుర్తించి లెడ్‌ బల్బులతోపాటు మీటరు బిగించి విద్యుత్‌ ఆదాకోసం ప్రయోగాత్మక ప్రయత్నాలు మొదలుపెట్టింది. విద్యుత్‌ వినియోగం, బిల్లుల చెల్లింపు తదితర పలుమార్లు మేయర్, కమిషనర్‌తో చర్చించారు. హడావుడి చేసిన సంస్థ దశలవారీగా అన్ని డివిజన్లలో బిగిస్తామని ఐదు డివిజన్లకే పరిమితం చేసింది.

    ఆదా..అధిక వెలుగు
    ఎల్‌ఈడీ బల్బుల బిగింపుతో విద్యుత్‌ ఆదాతోపాటు అధిక వెలుగు వస్తుంది. ప్రస్తుతం నరగపాలకసంస్థలో నెలకు రూ.30 లక్షల మేర వీధిదీపాల బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏటా రూ.3.6కోట్లు చెల్లింపులు భారంగా మారుతున్నాయి. వీటితోపాటు నిర్వహణ గుదిబండగా మారింది. ఒక్క పైసా ఖర్చు లేకుండా సదరు కాంట్రాక్టు పొందిన సంస్థనే ఎల్‌ఈడీ లైట్లు బిగించే ఒప్పందం ఉంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాంతాల్లో ఈఈఎస్‌ఎల్‌ సంస్థ మొదట పాత వీధిదీపాలను తొలగించి ఎల్‌ఈడీలు బిగించింది. లెడ్‌ల వినియోగంతో కలిగే విద్యుత్‌ ఆదాకు సంబంధించి మిగిలే బిల్లులు సంస్థ రాబట్టుకోనుంది.  


    ప్రయోగం ఎన్నాళ్లు?
    ఎల్‌ఈడీ పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికైన నగరపాలకసంస్థ పరిధిలో 10,745 ట్యూబ్‌లైట్లు, 2,517 ఎస్‌వీ లైట్లు, 568 సెంట్రల్‌లైట్లు, 264 మినీ హైమాస్ట్‌లైట్లు, 268 హైమాస్ట్‌ లైట్లు ఉన్నాయి. వీటి స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు బిగించాలి. ఎనిమిది నెలలు గడిచినా ఇటు పాలకులు కానీ, అటు ఈఈఎస్‌ఎల్‌ సంస్థకానీ పట్టించుకోవడంలేదు. మొదటి దఫా ఎల్‌ఈడీల బిగింపు పూర్తయ్యాక రెండు నెలలపాటు పరిశీలించి దశల వారీగా అన్ని డివిజన్లలో బిగించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ఎల్‌ఈడీ వెలుగులు నగర ప్రజలందరూ చూడాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement