బెల్లంపల్లి : సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
-
జిల్లా సాధన కమిటీ నాయకులు
బెల్లంపల్లి : బెల్లంపల్లి జిల్లా కోసం న్యాయ పోరాటం చేస్తామని బెల్లంపల్లి జిల్లా సాధన కమిటీ నాయకులు తెలిపారు. బుధవారం పట్టణ సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్ (సీపీఐ), పాటి సుభద్ర (టీడీపీ), ఎండీ అఫ్జల్ (కాంగ్రెస్), బి.కేశవరెడ్డి (బీజేపీ) మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ప్రజాభిప్రాయ సేకరణతో ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తూనే మరోపక్క అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముందుగా ప్రకటించిన ప్రాంతాల్లో జిల్లా కార్యాలయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కొత్తగా ప్రకటించిన పలు జిల్లాలపై ప్రజల్లో తీవ్ర అసంతప్తి ఉందన్నారు. తూర్పు ప్రాంతంలో కేంద్రంగా ఉన్న బెల్లంపల్లిని విస్మరించి మంచిర్యాలను జిల్లాగా ప్రకటించడం సరికాదన్నారు. బెల్లంపల్లి జిల్లా సాధన కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంలకు,రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ ప్రత్యేక అధికారికి, జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేసిన స్పందించలేదన్నారు. బెల్లంపల్లి జిల్లా ఏర్పాటు కోసం మరోమారు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ నెల 9న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే కోర్టులో జిల్లా సాధన కమిటీ తరఫున బెల్లంపల్లి జిల్లా కోసం రిట్ ఫిటిషన్‌ను దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని సూచించారు. బెల్లంపల్లి జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతున్నా ఎమ్మెల్యే తాము దాఖలు చేయబోయే రిట్ పిటిషన్‌లో సంతకం పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సాధన కమిటీ నాయకులు చిప్ప నర్సయ్య, ఎం.చంద్రయ్య,జి.జయరాం, కె.గోవర్థన్, డి.సత్యనారాయణ, మంతెన మల్లేశ్, బి.లక్ష్మీనారాయణ, జి.చంద్రమాణిక్యం, కంకటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా వద్దంటూ విద్యార్థుల రాస్తారోకో
ఆదిలాబాద్ రిమ్స్ : నిర్మల్ జిల్లా ఏర్పాటను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో పెద్ద ఎత్తున విద్యార్థులు, ఆదిలాబాద్ సంరక్షణ సమితి నాయకులు రాస్తారోకో, మానవహారం చేపట్టారు. నిర్మల్ జిల్లా వద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆదిలాబాద్ ప్రజలు ఎంతో ఉద్యమించారని, రాష్ట్రం ఏర్పడితే జిల్లా అభివద్ధి చెందుతుందని అనుకున్నారన్నారు. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రస్తుతం ఆదిలాబాద్‌కు అన్యాయం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్‌ను మూడు ముక్కలు చేసి నిర్మల్‌ను విడదీయడం వల్ల విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రజలు నష్టపోతుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, వెంటనే నిర్మల్ జిల్లాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ సంరక్షణ సమితి నాయకులు ఈర్ల సత్యనారాయణ, జగదీశ్‌అగర్వాల్, ప్రమోద్‌ఖత్రి, బీజేపీ నాయకులు విజయ్‌సింగ్ షేకావత్, విజయ్‌కుమార్, జోగురవి, ప్రవీణ్, టీడీపీ నాయకులు అన్నపూర్ణ, రఫిక్, విద్యార్థులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి జిల్లా, న్యాయ పోరాటం, జిల్లా సాధన కమిటీ , Bellampally district, legal fit, district achevement committee