మరో రెండేళ్లు పోరాటం చేద్దాం
కార్పొరేటర్లతో వైఎస్ జగన్
కడప కార్పొరేషన్: ‘‘మరో రెండేళ్లు ఈ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండండి.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చూసి అధికారులు, పోలీసుల్లో కూడా మార్పు వస్తుంది, అప్పుడు మన మాటే వింటారు’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలంఖాన్‌పల్లె సమీపంలోని బుద్ద టౌన్‌షిప్‌లో కడప నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్లుగా మా కుటుంబం వెన్నంటి ఉన్న మీరు ఒకట్రెండు సంవత్సరాలు ఓపిక పడితే కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మరో ఏడాది ఓపిక పడితే పరిస్థితి పూర్తిగా తారుమారవుతుందని తెలిపారు. మీరంతా జిల్లాలో తనకు అండగా ఉంటే మిగతా జిల్లాల్లో పార్టీని బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు పేరుపేరునా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికీ మేలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. సొంత జిల్లాలోనే తలనొప్పులు తెస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పగా, ఇందుకు కార్పొరేటర్లంతా ముక్తకంఠంతో స్పందిస్తూ ప్రాణం పోయేంత వరకూ పార్టీని వీడబోమని ప్రతిన చేసినట్లు తెలుస్తోంది.
కొందరు కార్పొరేటర్లు వైఎస్ జగన్‌తో మాట్లాడుతూ మీరు జిల్లాకు వచ్చినప్పుడు కడపలో రైలు దిగి వెళితే నాయకులు, కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. దీనికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రతి నెలకో, రెండు నెలలకో కార్పొరేటర్లు, నాయకులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోవాలని, మీవల్ల పరిష్కారం కాని వాటిని తన దృష్టికి తీసుకురావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నగర మేయర్ కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషాలను సూచించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, పాకా సురే్‌ష్, చైతన్య, ఎస్‌ఏ షంషీర్, బోలా పద్మావతి, కె.బాబు, ఎన్.రషీదా తబస్సుమ్, ఎస్‌బి మహ్మద్ అన్సర్ అలీ, కోఆప్షన్ సభ్యులు నాగమల్లారెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.