ప్రైవేటు వైద్యం..ప్రాణాలు కష్టం! | Life difficult for private medical | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వైద్యం..ప్రాణాలు కష్టం!

Published Sun, Jun 26 2016 2:55 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

ప్రైవేటు వైద్యం..ప్రాణాలు కష్టం!

ప్రైవేటు వైద్యం..ప్రాణాలు కష్టం!

పేరుకే మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు
వైద్యం వికటించి మృతి చెందుతున్న రోగులు
డబ్బిచ్చి సర్దుబాటు చేసుకుంటున్న ఆస్పత్రుల నిర్వాహకులు
పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ

 

ఇటీవల ఓ యువకుడు  కడుపునొప్పితో అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆపరేషన్ చేయగా.. అది వికటించింది. కచ్చితంగా చనిపోతారని గ్రహించి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లగా అడ్మిషన్‌కు తిరస్కరించారు.  తిరిగి అనంతపురం ఆస్పత్రికే వెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని రోగి బంధువులు ఇక్కడి ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశారు.

ఎలాగూ చనిపోయే వ్యక్తి.. ఆస్పత్రిలోనే మృతిచెందితే గొడవకు దిగుతారని గ్రహించి దారిలోనే ఇంజక్షన్ వేసి చంపేందుకు పథకం పన్నారు. అలా చేయాలని ఓ టెక్నికల్ అసిస్టెంటుకు చెప్పగా.. అతను నిరాకరించాడు. దీంతో ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుణ్ని పంపి పథకాన్ని అమలు చేశారు. ఈ విషయం తెలిసి బంధువులు వాగ్వాదానికి దిగడంతో రూ.లక్ష చేతిలో పెట్టి పంపించారు. సీఎం రిలీఫ్‌పండ్ నుంచి కూడా సాయం చేయిస్తామని నమ్మబలికారు.

 
 
 
నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి ఇటీవల ఓ మహిళ వెళ్లింది. పిత్తాశయంలో రాళ్లు ఉండటంతో ఆపరేషన్ చేశారు. అది ఫెయిలైంది. పేగుకు రంధ్రం పడింది. దీన్ని గ్రహించిన డాక్టర్ బెంగళూరులోని ఓ ఆస్పత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. డిశ్చార్జి రిపోర్ట్ ఇవ్వకుండా పంపారు. బెంగళూరులో ఆ మహిళకు చికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమించి చనిపోయింది. దీంతో  రోగి బంధువులు అనంతపురంలోని ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.
 
పై ఇద్దరు కూడా పాతికేళ్లలోపు వారే. ఇద్దరి ఆరోగ్య సమస్యలు మరీ ప్రాణాంతకమైనవి కావు. అయినా ప్రాణాలు కోల్పోయారంటే అనుభవం లేని డాక్టర్లు... బాధ్యతారహితమైన చికిత్సే కారణం.
 
 
(సాక్షిప్రతినిధి, అనంతపురం) :- జిల్లాలో  గర్భస్త లింగ నిర్ధారణ చట్టం(పీసీపీఎన్‌డీ) యాక్టు ప్రకారం 147 రిజిష్టర్డ్ ఆస్పత్రులు ఉన్నాయి. చాలా ఆస్పత్రుల్లో పర్మినెంట్ డాక్టర్లు లేరు. అనుభవం లేని డాక్టర్లతో వైద్యసేవలు అందిస్తున్నారు. ఒక ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ మరో ఆస్పత్రిలోనూ కన్సల్టెంట్‌గా ఉంటున్నారు. కొన్ని ఆస్పత్రులలో ప్రభుత్వ డాక్టర్లు కూడా చికిత్స చేస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉంటే వారు ఆపరేషన్ చేస్తున్నారు. ఒకవేళ లేకపోయినా రోగులను వెనక్కి పంపడం లేదు. అనుభవ ం లేని డాక్టర్లతోనే పని కానిచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పొరపాట్లు జరిగి రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోయినా ఎమర్జెన్సీ కేసులను సైతం అడ్మిట్ చేసుకుంటున్నారు.

వేలకు వేలు ఫీజులు గుంజి వారం, పదిరోజుల తర్వాత చేతులెత్తేస్తున్నారు. తమ వల్ల కాదంటూ  బెంగళూరు, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లోనే అధికశాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇటీవల గుండె ఆపరేషన్ ఫెయిలై.. రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు  సర్దిచెప్పి పంపారు. ఇలాంటి సందర్భాల్లో రోగికి బీపీ పెరిగిందనో, ఎక్కువగా భయపడటంతో ప్రాణాలు పోయాయనే చెబుతూ తప్పించుకుంటున్నారు.
 
 పర్యవేక్షణ ఏదీ?
 ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యుల అర్హతలు, అనుభవం అన్నీ పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తూ డీఎంఅండ్‌హెచ్‌ఓ సర్టిఫికెట్ ఇస్తారు. ఐదేళ్లపాటు అనుమతి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. అయితే..జిల్లాలో వైద్యాధికారులు ఆస్పత్రిని తనిఖీ చేయకుండానే అనుమతి ఇచ్చేస్తున్నారు. తర్వాత కూడా వాటివైపు కన్నెత్తి చూడడంలేదు. కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులకు రాజకీయ అండ ఉండటంతో  భయపడి వైద్యాధికారులు తనిఖీలకు వెళ్లడం లేదు.  
 
 
 ఫిర్యాదు చేస్తే చర్యలు

 - డాక్టర్ వెంకటరమణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ
ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యంపై ఎవరైనా లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. మాకు 100 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటి నిర్వహణే భారంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేసే సమయం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి. ఫిర్యాదు లేకుండా తనిఖీలకు వెళితే మమ్మల్ని మరోరకంగా భావించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement