రిజిస్ట్రేషన్ల నిలిపివేతను ఎత్తివేయాలి
–వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి డిమాండ్
–రేపటి నుంచి పార్టీలకు అతీతంగా రిలే దీక్షలు
-స్పందించకుంటే 8 నుంచి ఆమరణ దీక్ష
కోరుకొండ (రాజానగరం) : మండల కేంద్రమైన కోరుకొండలో రైతులు, ప్రజల భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అన్నవరం దేవస్థానం ఈఓ కాకర్ల నాగేశ్వరరావుపై వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయానికి వచ్చిన ఈఓ వద్దకు రైతులు, ప్రజలతో పాటు విజయలక్ష్మి వెళ్ళారు. గ్రామంలో గత కొన్నేళ్ళుగా అనుభవిస్తున్న పొలాలు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కాకుండా చేయడంతో రైతులు, ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి సుమారు 11 వందల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపివేయడంతో అనేక మంది మంచాన పడ్డారని, వారి ఉసురు అన్నవరం దేవస్థానానికి, స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పక తగులుతుందని అన్నారు. బాధిత రైతులు, ప్రజల తరఫున ఈ నెల 3 నుంచి రిలే నిరాహార దీక్షను పార్టీలకు అతీతంగా చేపడతామని, అధికారులు స్పందించకపోతే మార్చి 8న ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. దీంతో ఈఓ మాట్లాడుతూ 11 వందల ఎకరాలలో 350 ఎకరాలకు రికార్డులు దొరికాయని, వాటికి రిజిస్ట్రేషన్లు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి అభ్యంతరం తెలిపిన విజయలక్ష్మి 11 వందల ఎకరాలకూ రిజిస్ట్రేషన్లు చేయడానికి అనుమతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రైతులు, ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రైతులు, ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు అయిల శ్రీను, తోరాటి శ్రీను, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, బొరుసు బద్రి, గరగ మధు, సలాది వెంకటేశ్వరరావు, వాకా నరసింహరావు, నీరుకొండ యుధిష్టర నాగేశ్వరరావు, మారిశెట్టి తేజోవీరన్ననాయుడు, ముద్దా అణు, వుల్లి గణనాథ్ తదితరులు పాల్గొన్నారు.