-
ఎక్సైజ్, పోలీసు, ఇద్దరు అధికార పార్టీ నేతలకు నెల మామూళ్లు
-
మద్యం దుకాణాల్లో బాటిల్ మీద రూ.10, బీర్ మీద రూ.15 అదనంగా వసూలు
-
బెల్ట్ షాపులు, దాబాల్లో 25 శాతం అదనపు దోపిడీ
-
టీడీపీ నేతలే సిండికేట్ల రింగు లీడర్లు
సాక్షి ప్రతినిధి – నెల్లూరు :
టీడీపీ నేతలు రింగులీడర్ల అవతారమెత్తారు. అధికారులు వత్తాసు పలుకుతున్నారు. మద్యం సిండికేట్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. జిల్లాలో మద్యం వ్యాపారులు, కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలు, ఎక్సైజ్, పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలు చేతులు కలిపి ఏడాదికి రూ.100 నుంచి రూ.120 కోట్లు జనం సొమ్ము కొల్లుగొడుతున్నారు. ఈ వ్యహారాన్ని బయటపెట్టాల్సిన వ్యవస్థలకు కూడా తృణమో, పణమో ముట్టుజెబుతూ అడ్డూ అదుపూ లేకుండా అక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న వైన్‌షాపులో మద్యం బాటిల్ మీద ఉన్న ఎంఆర్‌పీ కంటే రూ.10 అదనం, షాపుల నుంచి సబ్ లీజు తీసుకుని నడుపుతున్న బెల్ట్ షాపుల్లో అయితే బాటిల్ మీద రూ.20 అదనం.. బీర్ల విషయానికొస్తే అనుమతి ఉన్న దుకాణాల్లో రూ.15, బెల్ట్ షాపుల్లో రూ.25 అదనపు ధర. ఇక బార్లు, డాబాల్లో అయితే ఎవరి ధర వారిదే. ఇలా చిత్తమొచ్చినట్లు దోపిడీ చేస్తున్నారు.
2015–2017ఆబ్కారీ సంవత్సరంలో జిల్లాలో 349 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ లాటరీ నిర్వహించింది. ఇందులో 340దుకాణాలను వ్యాపారులు లాటరీలో దక్కించుకుని మద్యం దుకాణాలు నడుపుతున్నారు. సగటున జిల్లాలో రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.50కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నెలకు రూ.70 నుంచి రూ. 80కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఎంఆర్‌పీ, ట్రాక్ అండ్ ట్రేసర్ విధానం, కంప్యూటర్ బిల్లింగ్ పక్కాగా అమలు, బెల్టుషాపుల నియంత్రణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వ్యాపారులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వీటన్నింటికీ సమాధి కట్టి వాటి మీద ఆదాయం సంపాదించుకుంటున్నారు.
పక్కాగా దోపిడీ
మద్యం దుకాణాల్లో క్వార్టర్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.15వరకు, బీర్‌పై రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని. బెల్ట్ షాపుల్లో 10 శాతం రవాణా టాక్స్ కలిపి బాటిల్‌పై రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. దాబాల్లో అయితే సర్వీస్ టాక్స్, పోలీస్ టాక్స్, ఎక్సైజ్ టాక్స్ పేరుతో మొత్తానికి 25 శాతం అదనంగా దోచేస్తున్నారు. జిల్లాలో సగటున నెలకు రూ.70 నుంచి రూ.80కోట్ల మేర విక్రయాలు సాగుతున్నాయి. అదనపు ధరల రూపంలో నెలకు రూ.10 నుంచి రూ.12 కోట్ల మేరకు జనం సొమ్ము కొల్లగొడుతున్నారు. జిల్లాలో 48బార్లు ఉన్నాయి. ఓ మోస్తరు బార్‌లో 180ఎంఎల్(క్వార్టర్)పై రూ. 50 నుంచి రూ.60వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మిగిలిన వాటిలో క్వార్టర్ బాటిల్ మీద అదనంగా రూ. 100వరకు లాగేస్తున్నారు. క్వార్టర బాటిల్ మీద ఎంఆర్‌పీ కంటే రూ.100 అదనంగా వసూలు చేయడంపై మందుబాబులు బార్ నిర్వాహకులతో రోజూ ఎక్కడో ఒక చోట గొడవలు పడుతూనే ఉన్నారు.
వాటాలు ఇలా..
జిల్లాలో 340 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో దుకాణం జరిగే రోజు వారి వ్యాపారాన్ని బట్టి ఎక్సైజ్ , పోలీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు మామూళ్లు చెల్లించాల్సి వస్తోంది. నెల్లూరు నగరంలో ఒక్కో దుకాణదారుడు ఎక్సైజ్ శాఖకు రూ.30వేలు, జిల్లాలోని మున్సిపాల్టీ కేంద్రాల్లో రూ. 25వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.15వేలు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతున్నారు. కంప్యూటర్ బిల్లింగ్, స్కానింగ్ ఉల్లంఘనకు ఒక్కో దుకాణం రూ. 5వేలు మామూలు ముట్టచెబుతున్నారు. ఒక్కో బెల్టుషాపు రూ.3వేల వరకు మామూళ్లు చెల్లిస్తున్నారు. ఈ మొత్తం విజయవాడలోని ఆ శాఖ పెద్దల నుంచి ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వరకు వాటాల రూపంలో చేరుతోంది. ఇది కాకుండా బార్ల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయి. ఏతా వాతా చూస్తే జిల్లాలో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ శాఖకు నెలకు అక్షరాల రెండున్నర కోట్ల వరకు మామూళ్లు ముట్టచెబుతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. పోలీసు శాఖకు నెల్లూరు నగరంలో ఒక్కో దుకాణం నుంచి రూ.15 నుంచి 17వేల వరకు, మున్సిపాలిటీల్లో æ రూ.15వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల వరకు మూముళ్లు ఖరారు చేసి పంపకాలు జరుగుతున్నాయి. జిల్లా మొత్తం లెక్క కడితే పోలీసుశాఖకు నెలకు రూ కోటిన్నరకు పైగా మద్యం మామూళ్లు అందుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ బయటపెట్టాల్సిన మీడియా ప్రతినిధుల్లో కొందరికి నెలకు రూ.15 లక్షల దాకా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం.
సిండికేట్లదే పెత్తనం
జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి జిల్లా, నగరస్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. సిండికేట్లలో 90 శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు. దీంతో ఆబ్కారీశాఖలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఎంఆర్‌పీ ఉల్లంఘనల మీద అడపా, దడపా అయినా గట్టిగా దాడులు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తే అధికార పార్టీ ముఖ్య నేతలు వారి చేతులు కట్టేస్తున్నారు. దీంతో మద్యం అధిక ధరల దోపిడీని ప్రశ్నించే వారే లేకుండా పోయారు.
ఆ రెండు నియోజక వర్గాల్లో అధికార పార్టీ ముఖ్యులకూ మామూళ్లు
జిల్లాలోని 8 నియోజక వర్గాల్లో పార్టీ సభలు, సమావేశాలు,‡ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ సమయంలో అధికార పార్టీ ముఖ్య నేతలు మద్యం దుకాణదారుల నుంచి ఉచితంగా మద్యం తీసుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సైతం మద్యం ధరల దోపిడీలో వాటాదారులయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తన నియోజక వర్గంలో ఎంఆర్‌పీ ధరల కంటే అదనంగా వసూలు చేస్తున్నారని రాపూరులో ధర్నా చేశారు. మద్యం దుకాణ దారుల అధిక ధరల దోపిడీని ఒప్పుకునే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. నియోజకవర్గంలోని మద్యం వ్యాపారులంతా సూళ్లూరుపేటకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ను ఆశ్రయించారు. ఆయన మధ్యవర్తిత్వం చేసి మద్యం వ్యాపారులు, ఎమ్మెల్యేకు రాజీ కుదిర్చినట్లు ప్రచారంలో వుంది. ఇందుకు గాను మద్యం వ్యాపారులు ఎమ్మెల్యేకు ఏక మొత్తంగా రూ.40 లక్షలు బహుమతి ఇచ్చారని, ఏడాదికి ఒక్కో షాపు నుంచి రూ.లక్ష చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిరిందని అధికార పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తున్నా, ఎంఆర్‌పీ ధరల కంటే 15 శాతం పెంచి మద్యం విక్రయిస్తున్నా ఆయన ఇప్పుడు పట్టించుకోవడం లేదు.
గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పాశం సునీల్ కుమార్ అధికార పార్టీలోకి ఫిరాయించడంతోనే మద్యం వ్యాపారులను తన దారిలోకి తెచ్చుకున్నారు. తొలుత కొన్ని లక్షలు బహుమానంగా సమర్పించుకున్న వారు, ఇప్పుడు నియోజక వర్గంలోని ప్రతి దుకాణం నుంచి ఏడాదికి రూ.50 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సునీల్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. అయితే మద్యం ధరల దోపిడీ మీద మాత్రం నోరెత్తడం లేదు.