ఇలా అయితే దాహం తీరేదెలా?
► తక్కువ ట్రిప్పులు తోలి.. ఎక్కువ నమోదు
► ప్రజలకు తప్పని ఇబ్బందులు
పోరుమామిళ్ల: జిల్లాలోని పోరుమామిళ్ల పట్టణంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు అర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకున్నారు.పంచాయతీ ఆధ్వర్యంలో 65 ట్యాంకర్లు నీరు సరఫరా చేస్తున్నారు. అవసరాలు తీరడం లేదని ఫిర్యాదులు రావడంతో 75కు పెంచారు. అయితే కొంతమంది తక్కువ ట్యాంకర్లు తోలి ఎక్కువ ట్రిప్పులు నమోదు చేసి దోచుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. వాటి గురించి విచారణ చేయకుండా మళ్లీ ట్రిప్పులు పెంచారు.
పట్టణంలోని జనాభాకు 4 లక్షల లీటర్ల నీరు కావాలని, ఆ మేరకు సరఫరా చేయాలంటే 125 ట్యాంకర్లు అవసరం అవుతాయని అధికారులపై పాలకపార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి ట్రిప్పులు పెంచుకున్నారు. 50 ట్రిప్పులు తోలి 75 నమోదు చేయిస్తుండటం వల్లే నీటి అవసరాలు తీరడం లేదని వివిధవర్గాల వారు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని ట్రిప్పులు తోలుతున్నారు? ప్రజలకు ఎన్ని అందుతున్నాయనేది తెలుసుకుని విచారణ చేయాలని కోరుతున్నారు. చాలా వీధుల్లో నీరు అందక డ్రమ్ము రూ. 30 నుంచి 40 రూపాయలు చెల్లించి కొంటున్నారు. కొందరు పైపుతో ట్యాంకుకు పట్టుకుంటున్నారు. ఉచితంగా నీరు సరఫరా చేస్తే ఇలా కొనాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు.