లోకల్ పాండీ బజార్
♦ వ్యాపార, వైద్య సేవలకు ప్రసిద్ధి ఎంజీ రోడ్
♦ అన్ని రకాల వస్తువులూ ఇక్కడ దొరుకుతాయి
♦ రోజూ కోట్ల రూపాయల్లో వాణిజ్య లావాదేవీలు
కొత్తగూడెం: కొత్తగూడెంలోని ఎంజీ రోడ్డు, గణేష్ టెంపుల్ ఏరియా..కొత్తగూడెం కా ‘పాండీ బజార్’గా విరాజిల్లుతోంది. రైల్వేస్టేషన్ ప్రారంభం నుంచి గణేష్ టెంపుల్ ఏరియా దాటుకుని ముర్రేడువాగు బ్రిడ్జి ప్రారంభం వరకు వస్త్ర దుకాణాలకు, ఆస్పత్రులకు ప్రసిద్ధి. వివిధ రకాల దుకాణాలు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నాయి. నిత్యం వేలమందితో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. రోజూ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.
వస్త్ర దుకాణాలకు ప్రసిద్ధి
రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వస్త్ర, వ్యాపార సంస్థలన్నీ కొత్తగూడెంలోని ఎంజీ రోడ్డులో విస్తరించి ఉన్నాయి. జాతీయ రహదారికి ఇరువైపులా క్లాత్ అండ్ రెడీమేడ్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ప్రారంభోత్సవానికి సైతం ప్రముఖ సినీ నటీమణులు విచ్చేసి జిల్లా ప్రజలను ఆకట్టుకున్నారు. వీటితోపాటు జాతీయ రహదారికి వెనుక పక్కన చిన్న, పెద్ద బజార్‌లలో అనేక నిత్యావసర వ్యాపారాలు జరుగుతుంటాయి. సిమెంట్, ఐరన్, కిరాణ, ప్లాస్టిక్, ఫ్రూట్, ఫ్యాషన్ తదితర వ్యాపారాలు ఒకే చోట కేంద్రీకృతమయ్యాయి. దీంతో నిత్యం వినియోగదారులతో, జిల్లా వాసులతో ఈ బజారు కళకళలాడుతుంది.
ఎమర్జెన్సీ వైద్యానికి కేంద్రం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎమర్జెన్సీ వైద్యానికి కేంద్రంగా మారింది గణేష్ టెంపుల్ ఏరియా. అన్ని విభాగాల వైద్యుల ఆస్పత్రులన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా ఆస్పత్రులు, మెడికల్ దుకాణాలు, ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎమర్జెన్సీ సదుపాయాలు, మెడికల్ సామగ్రిని సైతం వైద్యులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. స్పెషలైజ్డ్ ఎమర్జెన్సీ సేవలను సైతం జిల్లా ప్రజల ముంగిటకు చేరుస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు ఎమర్జెన్సీ వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఇటీవల తగ్గాయి. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ప్రముఖ సెల్, ఇతర అన్ని రకాల దుకా ణాలు కూడా ఉన్నాయి. ఇక పండుగ రోజుల్లో ఈ వీధి జాతరను తలపిస్తుంది. దీపావళి, వినాయక చవితి తదితర పండగ సమయాల్లో పూజ సామగ్రి ఇక్కడే విక్రయిస్తుంటారు.
హోటల్స్, సినిమా థియేటర్లకు నెలవు
ఇతర ప్రాంతాల నుంచి కొత్తగూడేనికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు బసచేసేందుకు కావాల్సిన హోట ల్స్ 7హిల్స్ నుంచి మొదలుకొని గణేష్‌టెంపుల్ ఏరి యా వరకు నెలకొని ఉన్నాయి. ఒక్కసారి ఎంజీ రోడ్ కు వస్తే అవసరమైన వస్తువులన్నీ కొనుగోలు చేసుకునే వీలుఉంటుంది. ఒక్కోవస్తువు కోసం ఒక్కో బజా ర్‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రతీ ఒక్కటి ఇక్కడే లభి స్తుండటం విశేషం. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా థియేటర్లు ప్రధాన రహదారి వెంబడి ఉన్నాయి.
కూలీలకు అడ్డా... గణేష్ టెంపుల్:
రోజువారీ కూలీలకు గణేష్ టెంపుల్ సెంటర్ అడ్డాగా ఉంది. భవన నిర్మాణ రంగంలో పనిచేసే వివిధ రకా ల కార్మికులు కొత్తగూడెం సమీప ప్రాంతాల నుంచి రోజూ ఉదయమే వందల సంఖ్యలో చేరుకుని కూలీ పనుల కోసం ఎదురుచూస్తుంటారు. కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ మేస్త్రీలు ఈ అడ్డాలో ఉండే కార్మికులను ప్రతిరోజు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుండటం విశేషం.
50 ఏళ్లుగా వ్యాపారంలో..
కొత్తగూడెంలో 50 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నాం. గతంలో క్లాత్, ప్రస్తుతం రెడిమేడ్ వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నాం. వినియోగదారులకు మారుతున్న అభిరుచులకు తగ్గట్లుగా వస్త్రాలను అందించగలుగుతున్నాం. తరతరాలుగా వినియోగదారుల ఆదరణ ఉంది. –భవాని ప్రసాద్, వస్త్ర వ్యాపార యజమాని