బైక్ అదుపు తప్పి.. తల పగిలి..
– మద్దికెరకు చెందిన వైఎస్సార్‌సీపీ రైతు సంఘం అధ్యక్షుడి మృతి
– కుమారుడికి తీవ్ర గాయాలు
గుంతకల్లు రూరల్: గుంతకల్లు–మద్దికెర మార్గంలోని వేర్‌హౌస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మద్దికెర మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధం రైతు సంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు(58) మరణించగా, ఆయన కుమారుడు రాజగోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. పదిహేనేళ్లుగా రాజగోపాల్ గుంతకల్లులో స్థిరనివాసం ఏర్పరుచుకొని పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తరచూ వెంకట్రాముడు కుమారుడి వద్దకు వెళ్లొచ్చేవారు. మంగళవారం ఉదయం కూడా కుమారుడితో కలసి బైక్‌పై బయలుదేరగా మద్దికెర రహదారిలోని వేర్‌హౌస్ వద్ద వారి బైక్ అదుపు తప్పింది. దీంతో వెంకట్రాముడు తల రెండు ముక్కలుగా చీలి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, రాజగొపాల్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. సమీప పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. వారొచ్చి క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకట్రాముడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించగా, రాజగోపాల్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లికార్జున, ఇతర పార్టీ నాయకులు గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వెంకట్రాముడు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు.