సాక్షి, కర్నూలు: శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో గన్‌మెన్‌లు మహబూబ్‌బాషా, శ్రీనివాసులు గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు వారి మాటల్లోనే..
కారు స్పీడ్ తగ్గించాలని చెప్పాం
మాది గోనెగండ్ల మండలం ఐరన్‌బండ గ్రామం. 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. రెండు వారాల కిందటే అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద డ్యూటీలో చేరాను. నంద్యాల నుంచి షర్మిలమ్మ పర్యటన ముగించుకుని రాత్రి ఆళ్లగడ్డకు అవుట్‌లాండ్ కారులో అక్కతో పాటు నేను, మరో గన్‌మెన్ శ్రీనివాసులు బయలుదేరాం. రెగ్యులర్ డ్రైవర్ కాకుండా నాగేంద్ర అనే మరో డ్రైవర్ వచ్చాడు. అతను మొదటినుంచి కారును చాలా దూకుడుగా నడపటం గమనించి స్పీడ్ తగ్గించమని కూడా చెప్పాం. వరి ధాన్యం కుప్ప పక్కనే ఉన్న రాళ్లను ఎక్కించగానే... ఏయ్ అని అరవడంతో సడన్‌గా స్టీరింగ్ తిప్పేశాడు. దీంతో 140-150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. గన్‌మెన్‌లిద్దరం తేరుకునేలోపే అక్కను ఆసుపత్రికి తరలించారు.
- ఎన్.మహబూబ్‌బాషా, గన్‌మన్
ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునేవారు
మాది గోస్పాడు మండలం యాళ్లూరు. నేను 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాను. అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద గన్‌మన్‌గా గత సంవత్సరం జూలైలో చేరాను. బుధవారం ఉదయం 7.30 గంటలకు గ్రామాల్లో ఎన్నిక ల ప్రచారానికి బయలుదేరాం. తర్వాత సాయంత్రం 4.30 గంటలకు నంద్యాలలో షర్మిలక్క ప్రచారంలో పాల్గొన్నాం. రాత్రి 11 గంటలకు ఆళ్లగడ్డ బయలుదేరాం. అక్క (శోభానాగిరెడ్డి) ముందు సీట్లో కూర్చున్నారు. ఉదయం, సాయంత్రం ఆ రోడ్డునే వెళ్లినా... రోడ్డుపక్కగా ఉన్న వరి ధాన్యం కుప్పలను మేము పెద్దగా గమనించలేదు. ప్రమాదం ధాటికి అక్క కారులోంచి ఎగిరి పడినట్లున్నారు. కారులో అక్క ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునే కూర్చునేవారు. కానీ నిన్న అలసిపోయి బెల్టు పెట్టుకోవడం మరిచిపోయినట్లున్నారు.
-శ్రీనివాసులు, గన్‌మన్