శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర(32) నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండాపోయాడు.
నంద్యాల, న్యూస్‌లైన్: శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర(32) నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండాపోయాడు. బుధవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన అతన్ని పోలీసులు తొలుత ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి నంద్యాలకు తరలించారు. శరీరంపై గాయాలు లేకపోయినా కడుపు, ఛాతీలో నొప్పితో బాధపడుతుండటంతో వైద్యులు చికిత్స చేశారు. గురువారం ఉదయం 9 గంటల తర్వాత నాగేంద్ర తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వెంటనే మేడమ్‌ను చూడాలని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతను ఎక్కడా కనిపించకపోవడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమైన నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరుగా, తండ్రి సుబ్బరాయుడుగా ఆసుపత్రిలో వివరాలు నమోదయ్యాయి.