రూ.పది కోట్లతో లోవ దేవస్థానం బడ్జెట్
రూ.పది కోట్లతో లోవ దేవస్థానం బడ్జెట్
Published Sun, Mar 26 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
– రూ.80 లక్షలు మిగులు
– ఏప్రిల్ 13 నుంచి 26వరకు అమ్మవారి గంధామావాస్య జాతరోత్సవాలు
– పాలకమండలిలో తీర్మానాలు
తునిరూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.పది కోట్లతో అంచనాల బడ్జెట్‌ను ఆమోదించింది. ఆదివారం చైర్మన్ కరపా అప్పారావు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ప్రతిపాదిత బడ్జెట్‌లో రూ.80లక్షలు మిగులుగా అంచన వేశారు. హుండీలు, వేలంపాటలు, ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.పది కోట్ల సమకూరుతుందని, జీతాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, అమ్మవారి ఉత్సవాలకు వ్యయం రూ.9.20కోట్ల అవుతుందని అంచనాలు వేశారు. వ్యయం పోగా రూ.80లక్షలు మిగులుగా అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ చూపారు. వేలంపాటలు, బహిరంగా వేలం ద్వారా లైసెన్సులు వసూళ్లును రూ.2.25కోట్లు వస్తుందని పేర్కొని, వేలం పాటలను ఆమోదించారు. గడిచిన మూడు నెలలకు రాబడి, వ్యయాలను ఆమోదించారు. తలుపులమ్మ అమ్మవారి పవిత్ర, ఆచారాలకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్తలు పేర్కొన్నారు.
13 నుంచి ఉత్సవాలు..
తలుపులమ్మ అమ్మవారికి పుట్టింట సంబరాలుగా పేర్కొనే గంధామావాస్య జాతర మహోత్సవాలను ఏప్రిల్ 13 నుంచి 26 వరకు నిర్వహించాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు. జాతర ఉత్సవాలను లోవకొత్తూరు గ్రామంలో లోవదేవస్థానానికి చెందిన నాలుగు ఎకరాల స్థలంలో ఆలయం వద్ద నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన నిధుల వినియోగానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోద ముద్రవేశారు. ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, తర్రా బుల్లెబ్బాయి, కిల్లి శ్రీను, నారాయణాచార్యులు, పుల్లంరాజు, దూలం సత్యనారాయణ, సూపరింటెండెంట్లు కె.వి.రమణ, ఎల్.వి.రమణ పాల్గొన్నారు.
Advertisement