హరిసర్వోత్తమ.. వాయుజీవోత్తమ
హరిసర్వోత్తమ.. వాయుజీవోత్తమ
Published Sun, Aug 21 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
– శ్రీమఠంలో కనుల పండువగా మధ్యారాధన
– పవిత్రంగా మహా పంచామృతాభిషేకం
– రమణీయంగా సాగిన బంగారు రథోత్సవం
మంత్రాలయం : హరిసర్వోత్తమ.. వాయుజీవోత్తమ నామస్మరణతో శనివారం శ్రీమఠం మారుమోగింది. శ్రీరాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పాదాలకు కనకాభిషేకం, మూల,జయ, దిగ్విజయ రాముల పూజోత్సవం మైమరిపించింది. భక్తజనం రాయరు నామస్మరణ పఠిస్తుండగా రాయరు బందావన ప్రతిమ, పరిమళ న్యాయ సుధాగ్రంథాన్ని బంగారు రథంపై కొలువుంచారు. పీఠాధిపతి హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. భారీ భక్తజన సందోహం మధ్య రథయాత్ర శ్రీమఠం మాడవీధుల్లో రమణీయంగా సాగింది. భక్తులు రాఘవేంద్రస్వామి దర్శనార్థం 5 గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. రాత్రి గజవాహనంపై ఉత్సవమూర్తిని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఊంజల సేవ, దివిటీ సేవలో పీఠాధిపతి తరించారు.
రాఘన్నకు వెంకన్న పట్టు వస్త్రాలు ..
ఆనవాయితీ ప్రకారం శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాఘవేంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపం నుంచి గజరాజు, పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో పట్టువస్త్రాలకు ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా శ్రీమఠం చేరుకోగా పీఠాధిపతి ఎదురుగా వెళ్లి సాదరంగా ఆహ్వానించారు. టీటీడీ అధికారి గురురాజారావు నుంచి పట్టువస్త్రాలు స్వీకరించి శిరస్సుపై ఉంచుకుని ఊరేగారు.
కనువిందు చేసిన కళా ప్రదర్శనలు..
మధ్యారాధన సందర్భంగా కర్ణాటక డప్పువాయిద్య కళాకారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యోగీంద్ర మండపంలో మోహన్ ఆలపించిన భక్తిగేయాలు ఆధ్యాత్మికంలో ముంచెత్తాయి. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.
Advertisement