#Holi2024హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. చెడుపై మంచి విజయానికి సూచిక. ఈ ఏడాది మార్చి 25, సోమవారం హోలీ జరుపుకుంటాం. అసలు హోలీ అంటే ఇలా ఉండాలి అనేలా జరుపుకునే ప్రదేశాల గురించి మీకు తెలుసా?
హోలి అంటే వివిధ రకాల రంగులు, చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. ప్రతీ రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్‌లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్‌లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. మన దేశంలోని కొన్ని చోట్ల అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
ఉత్తర్ ప్రదేశ్: యూపీ,మథురలోని బర్సానా లత్మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఈ హోలీ వేడుకలు ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. స్త్రీలు సంప్రదాయబద్ధంగా గోపికల వేషధారణతోనూ, పురుషులు గో పురుషులుగానూ మారి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మథురలోని రాధా కృష్ణుల ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. భజనలు, సంకీర్తనలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. స్థానికులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా హోలీ వేడుకలతో సందడి చేయడం విశేషం.
బృందావన్: ఇక్కడ హోలీ వేడుక వారం రోజుల పాటు సాగుతుంది. పువ్వులు, రంగులతో హోలీని ఆడతారు. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. రంగుల్లో మునిగి తేలడంతోపాటు,పురాణ ఇతిహాసాలు, స్థానిక జానపద కథల ప్రస్తావనలతో వారం పాటు వేడుక కొనసాగుతుంది.
శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్, బోల్పూర్‌లో ఉన్న శాంతినికేతన్ హోలీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక్కడ దీనిని బసంత ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. రవీద్ర భారతి యూనివర్శిటీలో నోబెల్ గ్రహీత రవీద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను నిర్వహించడం మొదలెట్టారట. ఈ ప్రేరణతోనే సాధారణ వేడుకలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి.
పంజాబ్: పంజాబ్‌లో హోలీ పండుగను హోలా మొహల్లాగా జరుపుకుంటారు. 'హోలా-మొహల్లా' అంటే 'యుద్ధ-నైపుణ్యాల సాధన' అని అర్థం. అందుకే హోలీ వేడుకలో కత్తులతో విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నిహాంగ్ సిక్కులు ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీని పౌరుషానికి ప్రతీకగా, ధైర్యవంతుల హోలీగా వేడుక చేసుకుంటారు.
ఉదయపూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలకు పెట్టింది పేరు. అక్కడ ఉండే మేవార్ రాజ వంశస్థులు ఈ పండుగను హోలికా దహన్ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా హోలీ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా హోలిని జరుపుకుంటారు.
కాగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై నగరాల్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణాలో చిన్నా, పెద్ద అంతా,ముఖ్యంగా యువత ఈ రంగుల హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment