'డ్రంకన్ డ్రైవ్' కు వినూత్న శిక్ష
రాయదుర్గం: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి వినూత్న శిక్షను మెజిస్ట్రేట్ విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదని ప్లకార్డులు చేత పట్టి వరుసగా రెండు వరుసల్లో బారులు తీరి నడుచుకుంటూ రోడ్డుపై ప్రచారం చేసిన సంఘటన సోమవారం ఐటీ జోన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 22 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని సోమవారం మియాపూర్ కోర్టులో హజరుపర్చారు.
మెజిస్ట్రేట్ 22 మందికి వినూత్న శిక్షగా మద్యం సేవించి వాహనాలు నడుపరాదని ప్లకార్డులు చేతిలో పట్టుకొని రోడ్డు ప్రచారం చేసేలా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ట్రిపుల్‌ఐటీ కూడలి మీదుగా నానక్‌రాంగూడ ఐటీ జోన్‌లోని విప్రో సర్కిల్ వరకు ‘డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ’ అని వ్రాసి ఉన్న ప్లకార్డులను వారు చేతుల్లో ధరించి వాక్ నిర్వహించారు. ఈ వాక్‌ను మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ టి.నర్సింగ్ రావు, ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు.