కిందపడకుండా తీగలతో కట్టిన దృశ్యం
- ఒరిగిపోయిన గర్భాలయ గోపుర కలశం
- అపచారం జరగకముందే అధికారులు మేల్కోవాలి
మహానంది: ‘‘గోపుర కలశాన్ని దర్శించుకుంటే కోటిరెట్ల పుణ్యం లభిస్తుందని భావిస్తారు. ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోలేని వారు గోపుర కలశాన్ని దర్శించుకుంటే చాలని చెబుతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న గర్భాలయ గోపుర కలశం పరిరక్షణపై మహానంది పుణ్యక్షేత్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. స్వామివారి గర్భాలయ గోపురానికి ఎంతో విశిష్టత ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు కళింగ ఆర్కిటెక్చర్ నిర్మాణశైలిని పోలి ఉన్నట్లు చరిత్రకారులు, పురావస్తుశాఖవారు చెబుతున్నారు. అలాంటి గోపురం పైభాగంలోని కలశం ఓ వైపునకు ఒరిగి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. అపచారం జరగకముందే కొత్త కలశాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆలయ యాజమాన్యం పాతదానికే కడ్డీలు కట్టి మరీ బిగించి ఉంచడం గమనార్హం. ఇటీవలే మహానంది దేవస్థానానికి వచ్చిన కమిషనర్ అనురాధ, అధికారులు త్వరలో కలశ ప్రతిష్టాపన ఉంటుందని ప్రకటించినా ముహూర్తం నిర్ణయించకపోవడం గమనార్హం.
నూతన కలశం సిద్ధంగా ఉంది : రవిశంకర అవధాని, వేదపండితులు
ప్రస్తుతం ఉన్న కలశం స్థానంలో నూతనంగా ప్రతిష్టించేందుకు కొత్త కలశాన్ని తీసుకువచ్చాం. కంచికామకోటి పీఠాధిపతి చేత ప్రతిష్టకు చర్యలు తీసుకుంటున్నాం. మాఘ మాసం లేదా శివరాత్రి పర్వదినాల్లో కార్యక్రమం పూర్తి చేస్తాం.