kalasham
-
Meri Maati Mera Desh: దేశ రాజధానికి చేరుకున్న తెలుగునేల మట్టి కలశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నా నేల నా మట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వందలాది గ్రామాల నుంచి సేకరించిన మట్టిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రైలులో ఏపీ నుంచి 800 మంది, తెలంగాణ నుంచి 150 మంది వచ్చారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో ఉంచే కలశంలో ఈ మట్టిని పోస్తారు. తర్వాత ఆజాదీ కా మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని వినియోగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంప్రదాయ దుస్తులతో çఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం వారందరికీ వసతి, బస సౌకర్యాలు ఏర్పాటు చేసింది. లైజన్ ఆఫీసర్ సురేశ్‌బాబు, ఓఎస్డీ రవిశంకర్, జీవీఆర్ మురళి పాల్గొన్నారు. -
కనవయ్యా.. మహానందీశా!
- ఒరిగిపోయిన గర్భాలయ గోపుర కలశం - అపచారం జరగకముందే అధికారులు మేల్కోవాలి మహానంది: ‘‘గోపుర కలశాన్ని దర్శించుకుంటే కోటిరెట్ల పుణ్యం లభిస్తుందని భావిస్తారు. ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోలేని వారు గోపుర కలశాన్ని దర్శించుకుంటే చాలని చెబుతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న గర్భాలయ గోపుర కలశం పరిరక్షణపై మహానంది పుణ్యక్షేత్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. స్వామివారి గర్భాలయ గోపురానికి ఎంతో విశిష్టత ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు కళింగ ఆర్కిటెక్చర్ నిర్మాణశైలిని పోలి ఉన్నట్లు చరిత్రకారులు, పురావస్తుశాఖవారు చెబుతున్నారు. అలాంటి గోపురం పైభాగంలోని కలశం ఓ వైపునకు ఒరిగి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. అపచారం జరగకముందే కొత్త కలశాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆలయ యాజమాన్యం పాతదానికే కడ్డీలు కట్టి మరీ బిగించి ఉంచడం గమనార్హం. ఇటీవలే మహానంది దేవస్థానానికి వచ్చిన కమిషనర్ అనురాధ, అధికారులు త్వరలో కలశ ప్రతిష్టాపన ఉంటుందని ప్రకటించినా ముహూర్తం నిర్ణయించకపోవడం గమనార్హం. నూతన కలశం సిద్ధంగా ఉంది : రవిశంకర అవధాని, వేదపండితులు ప్రస్తుతం ఉన్న కలశం స్థానంలో నూతనంగా ప్రతిష్టించేందుకు కొత్త కలశాన్ని తీసుకువచ్చాం. కంచికామకోటి పీఠాధిపతి చేత ప్రతిష్టకు చర్యలు తీసుకుంటున్నాం. మాఘ మాసం లేదా శివరాత్రి పర్వదినాల్లో కార్యక్రమం పూర్తి చేస్తాం. -
కనుల పండువగా కలశ ప్రతిష్టాపన
– గర్భాలయ శిలా మండపానికి వాస్తు పూజ – స్వర్ణ లేపన గోపుర ప్రారంభోత్సవం మంత్రాలయం : శ్రీమఠంలో శనివారం స్వర్ణ లేపన శిఖర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శిలా మండపానికి వాస్తు పూజ కానిచ్చారు. ముందుగా పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు స్వహస్తాలతో మంగళవాయిద్యాల మధ్య గోమాత, అశ్వ, గజరాజు పూజలు గావించారు. శ్రీమఠం మాడ వీధులు చుట్టేసుకుంటూ గర్భాలయ ద్వారాలకు విశేష పూజలు చేశారు. మూలబృందావనం చేరుకునే ద్వారం గుండా ముందుగా గో ప్రవేశం చేయించారు. అనంతరం గర్భాలయంలో వాస్తు, శాంతి హోమాల్లో పీఠాధిపతి తరించారు. అనంతరం కలశంతో శ్రీమఠం వీధుల్లో భారీ ఊరేగింపుగా బయలు దేరారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, భక్తుల హర్షద్వానాల మధ్య బంగారు లేపనంతో నిర్మించిన శిఖరం చేరుకుని విశేష పూజల అనంతరం కలశ ప్రతిష్టాపనకు అంకురార్పణ పలికారు. కలశ శిఖరాన కపిరాజు విజయ ధ్వజారోహణ చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రతిష్టాపనోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.