కలశంతో ఊరేగింపుగా వస్తున్న పీఠాపతి, భక్తులు
కనుల పండువగా కలశ ప్రతిష్టాపన
Published Sun, Aug 14 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
– గర్భాలయ శిలా మండపానికి వాస్తు పూజ
– స్వర్ణ లేపన గోపుర ప్రారంభోత్సవం
మంత్రాలయం : శ్రీమఠంలో శనివారం స్వర్ణ లేపన శిఖర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శిలా మండపానికి వాస్తు పూజ కానిచ్చారు. ముందుగా పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు స్వహస్తాలతో మంగళవాయిద్యాల మధ్య గోమాత, అశ్వ, గజరాజు పూజలు గావించారు. శ్రీమఠం మాడ వీధులు చుట్టేసుకుంటూ గర్భాలయ ద్వారాలకు విశేష పూజలు చేశారు. మూలబృందావనం చేరుకునే ద్వారం గుండా ముందుగా గో ప్రవేశం చేయించారు. అనంతరం గర్భాలయంలో వాస్తు, శాంతి హోమాల్లో పీఠాధిపతి తరించారు. అనంతరం కలశంతో శ్రీమఠం వీధుల్లో భారీ ఊరేగింపుగా బయలు దేరారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, భక్తుల హర్షద్వానాల మధ్య బంగారు లేపనంతో నిర్మించిన శిఖరం చేరుకుని విశేష పూజల అనంతరం కలశ ప్రతిష్టాపనకు అంకురార్పణ పలికారు. కలశ శిఖరాన కపిరాజు విజయ ధ్వజారోహణ చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రతిష్టాపనోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
Advertisement