సూళ్లూరుపేట భారీ అగ్నిప్రమాదం
సూళ్లూరుపేట: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు ఎదురుగా అయ్యప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో 8 షాపులు కలిగిన కాంప్లెక్స్ అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి 9.30 గంటలకు షాపు మూసేసి ఇంటికి వచ్చేశారు. విద్యుత్ షార్ట్ సర్యూ్యట్‌తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. షాపుల్లో ఉన్న కర్పూరం, సెంట్ బాటిళ్లు, ఇతర కాస్మోటిక్ బాటిళ్లకు మంటలు అంటుకోవడం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న షాపు యజమానులు, స్థానికులు ట్రాన్స్‌కో అధికారులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే పవర్ కట్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది నీళ్లు పట్టినా మంటలు ఆదుపులోకి రాలేదు. స్థానికులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సమాచారం ఇవ్వడంతో ఆయన షార్ కేంద్రానికి ఫోన్ చేసి ఒక ఫైరింజన్‌ను, నాయుడుపేట ఫైర్ స్టేషన్ నుంచి మరో ఫైరింజన్‌ను పంపించారు. అప్పటికి కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆపాచికంపెనీకి చెందిన ఫైరింజన్‌ను పంపించే. రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాకా నాలుగు ఫైరింజన్లు నీళ్లు పోసి మంటలు కొంతమేర అదుపులోకి తెచ్చారు. 8 షాపులకు మంటలు వ్యాపించడంతో అందులో వున్న వస్తు సామగ్రి అంతా మాడిపోయింది. ప్రమాదంలో సుమారు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు. మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరు పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి చెత్త తొలగించారు.
నెర్రిలిచ్చిన కాంఫ్లెక్స్ భవనం...
కింద వున్న 8 షాపుల్లో వచ్చిన భారీ అగ్నిప్రమాదంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడడంతో పైన వున్న భవనం అంతా నెర్రిలిచ్చింది. సూళ్లూరుపేట పట్టణ చరిత్రలో ఇంత పెద్ద అగ్నిప్రమాదం సంభవించలేదని పెద్దలు చెబుతున్నారు. శనివారం రాత్రంతా మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు, స్థానికులు జాగారం చేశారు. షాపులు పెట్టుకున్న యజమానులకు అందరికీ కలిపి సుమారు కోటి రూపాయలు, భవనానికి మరో కోటి రూపాయలు కలిపి రెండు కోట్ల దాకా నష్టం వాటిల్లినట్టు అందరూ అంచనాలు వేస్తున్నారు.