షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాల దగ్ధం
సూళ్లూరుపేట: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు ఎదురుగా ఉన్న శేషాద్రి జనరల్ స్టోర్స్‌లో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది షాపులు కలిగిన కాంప్లెక్స్ దగ్ధమైంది. శేషాద్రి జనరల్ స్టోర్స్ యజమాని రాత్రి 10 గంటలకు షాపు మూసేసి ఇంటికి వచ్చేశాడు. ఆ షాపులోపల మంటలు అంటుకుని వాసన రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూశారు. షాపులోని దట్టమైన పొగ వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే షాపు యజమానికి తెలియజేశారు. షాపు డోర్ తెరవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌శాఖ వారు విద్యుత్ సరఫరాను అపేశారు. అగ్నిమాపక యంత్రంతో నీళ్లు పట్టినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో షార్ కేంద్రానికి ఫోన్ చేసి మరో యంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే నాయుడుపేటకు కూడా సమాచారం అందించి మరో ఫైరింజన్‌కూడా తీసుకొచ్చినా మంటలు అదుపులోకి రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఎనిమిది షాపుల్లో సరుకులన్నీ కాలి బూడిదయ్యాయి. భారీగా నష్టం వాటిల్లినట్టు తెలిసింది.