మన్యంపై మలేరియా పడగ
Published Tue, Sep 13 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
మన్యగ్రామాల్లో పెరుగుతున్న జ్వరాల కేసులు
తాజాగా రెండేళ్ల పసివాడిని కబళించిన మహమ్మారి
ఇప్పటికీ పూర్తి కాని నివారణ మందు పిచికారీ
నియంత్రణలో అలసత్వం వహిస్తున్న అధికారులు
రంపచోడవరం :
మన్యప్రాంతంలో మలేరియా మహమ్మారి విస్తరిస్తోంది. సీజనల్ వ్యాధులను నియంత్రించలేని వైద్యాధికారుల వైఫల్యానికి గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. దేవీపట్నం మండలం చింతలగూడెంకు చెందిన పొడియం బన్నీ అనే రెండేళ్ల పసివాడు మలేరియా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితికి చేరిన బన్నీని బుధవారం దేవీపట్నం నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే మృతి చెందాడు. ఇటీవల మలేరియా తీవ్రతకు పలువురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ మరణాలు మలేరియా అధికారుల రికార్డుల్లో నమోదు కావడం లేదు.
27 రోజులు ఆలస్యంగా పిచికారీ
ఏజెన్సీలోని 11 మండలాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది మలేరియా జ్వరాల సంఖ్య ఎక్కువైంది. దీనికి అధికారుల అలసత్వమే ప్రధాన కారణం. గ్రామాల్లో రెండు విడతల్లో జరగాల్సిన మలేరియా మందు పిచికారీని సుమారు 27 రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం జిల్లా మలేరియా కార్యాలయానికి నిధుల కొరతతో మలేరియా మందు పిచికారీ సకాలంలో చేపట్టలేకపోయారు. ఫలితంగా ఆ ఏడాది 20 మంది వరకు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే ఒకటిన ప్రారంభించాల్సిన పిచికారీని మే 27న ప్రారంభించారు. నలభై ఐదు రోజులకు ఒకసారి చొప్పున మలేరియా మందును రెండుసార్లు పిచికారీ చేయాలి. మెుత్తం 935 గ్రామాలకు ఇప్పటికి 480 గ్రామాల్లో మాత్రమే పిచికారీ పూర్తి చేశారు. ఏజెన్సీకి 3.60 లక్షల దోమతెరలు కావాలని ప్రతిపాదనలు పెడితే నేటికీ రంపచోడవరం డీఎంఓ కార్యాలయానికి చేరుకోలేదు. దోమ తెరలు ఇవ్వడంతో పాటు వాటి వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తేనే ఫలితాలు సాధించవచ్చు.
నమోదైన వాటి కంటే ఎక్కువ కేసులు..
గత ఏడాది కంటే మలేరియా కేసులు గణనీయంగా పెరిగాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 26 పీహెచ్‌సీలు ఉన్నాయి. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 1,85,306 మంది నుంచి రక్త నమునాలు సేకరించి, వారిలో 3,616 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 2,06,392 మంది రక్త నమునాలు సేకరించి, వారిలో 4,496 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. మారేడుమిల్లి పీహెచ్‌సీ పరిధిలో గత ఏడాది 231 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది 335 కేసులు నమోదయ్యాయి. తులసిపాకలలో 508 కేసులు నమోదు కాగా ఇక్కడ గత ఏడాది కంటే వంద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మంగంపాడు పీహెచ్‌సీలో 440 కేసులు నమోదు చేశారు. ఇక్కడ కూడా గతం కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. చవిటిదిబ్బల పీహెచ్‌సీలో గత ఏడాది 277 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 439 కేసులు నమోదు చేశారు. గిరిజనుల్లో అత్యధికులు జ్వరం వస్తే ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అంటే మలేరియా అధికారుల లెక్కల కంటే ఏజెన్సీలో మలేరియా కేసులు సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి.
సిబ్బంది కొరతతో వెల్లడి కాని వ్యాధి తీవ్రత
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన సిబ్బంది తగినంతమంది లేరు. ఎంపీహెచ్‌ఎస్‌లు 64 మంది పనిచేయాల్సి ఉండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విధి నిర్వహణలో గ్రామాల్లో పర్యటించి జ్వరాల కేసులు ఉంటే వారి రక్తనమూనాలు తీసుకుని మలేరియా నిర్ధారణ అయిన తరువాత మందులు ఇవ్వాలి. అలాగే రోగికి జ్వరం తగ్గిందా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ సిబ్బంది కొరత కారణంగా గ్రామస్థాయిలో రోగాల తీవ్రత బయటకు తెలియడం లేదు. కాగా మలేరియా వ్యాప్తిపై జిల్లా మలేరియా అధికారి పీఎస్‌ఎస్ ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండో విడత మలేరియా మందు పిచికారీ జరుగుతోందన్నారు.
Advertisement
Advertisement