జ్వరమా... అయితే మలేరియా కావచ్చు అనేది వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కొన్నేళ్లుగా ప్రజల్లోకి బాగా వెళ్లిన మాట. ఒకప్పుడు ప్రతి జ్వర పీడితుడిని పరీక్షించి మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు మలేరియాగా నిర్ధారించినా నివేదికలకు మాత్రం ఎక్కడం లేదు. కేసులు అధికమైతే ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి సిబ్బంది వ్యాధిగ్రస్తుల వివరాలను దాచి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎదురు చూసేకన్నావ్యాధికారక దోమలను నివారించుకోవడంతో మనకు మనమే మలేరియాను పారదోలాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
కర్నూలు(హాస్పిటల్) :జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి, 542 సబ్‌సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో కృష్ణానది, తుంగభద్ర, హంద్రీ, కుందు నదితో పాటు కేసీ కెనాల్, హంద్రీనీవా కాలువ, తెలుగుగంగ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, ఎల్‌ఎల్‌సీ కాలువ తదితరాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రీశైలం ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల ప్రాజెక్టు, వెలుగోడు రిజర్వాయర్‌లు ఉండటం వల్ల మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. దీంతో పాటు 18 శాతం నల్లమల అటవీప్రాంతాల్లోని 42 చెంచుగూడెల్లో మలేరియా రావడానికి అధికంగా ఆస్కారం ఉందని నిర్ధారించింది. ఈ మేరకు ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, పాణ్యం, బండి ఆత్మకూరు, గడివేముల, శ్రీశైలం మండలాల్లోని 50 గ్రామాలను సమస్యత్మక (మలేరియా వ్యాప్తికి అవకాశం ఎక్కువ) గ్రామాలుగా గుర్తించారు.
కేసులు తగ్గించే పనిలో వైద్యఆరోగ్య శాఖ..
ఒకప్పుడు ప్రతి ఒక్క జ్వరపీడితుడిని రక్తపరీక్ష చేసి మలేరియా నిర్ధారించిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు కేసులు తగ్గించేపనిలో పడింది. ఐదేళ్లుగా జ్వరపీడితుల సంఖ్య వాస్తవంగా తగ్గకపోయినా ఆ శాఖ అధికారులు తగ్గుతున్నట్లు నివేదికలు తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 5లక్షల 20వేలకు తగ్గకుండా రక్తనమూనాలకు పరీక్షలు(మలేరియా) చేస్తున్నారు. అయితే ఇందులో అన్ని కేసుల్లోనూ దాదాపుగా మలేరియా లేనట్లు వస్తోంది. లెక్కలు మార్చి చూపడం తప్ప వాస్తవాన్ని దాచిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మలేరియా తగ్గుముఖం పడుతోంది
గత నాలుగేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మలేరియా వ్యాధి తగ్గుముఖం పడుతోందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా నివారణ చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జూన్ ఒకటి నుంచి డీడీటీ 50 శాతం పిచికారీ చేయిస్తున్నామన్నారు. జిల్లాలోని 12 మలేరియా సబ్‌యూనిట్స్‌లో అవసరమైన కీటక సంహారక మందులను, పనిముట్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేసిన దోమతెరలను ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా హెల్త్ సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగర పాలక సంస్థల సహకారంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ఎ. నూకరాజు, క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
వ్యాధిలక్షణాలు
1. చలి, వణుకుతో కూడిన జ్వరం. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స లేకపోతే నెలల తరబడి బాధిస్తుంది.
2. ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వల్ల మన ప్రాంతంలో మలేరియా వస్తోంది.
3. ఇందులో వైవాక్స్ మలేరియా తక్కువగా బాధిస్తే, పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువ బాధించడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో ప్రమాదస్థాయికి చేరుతుంది.
4. మన్య(గిరిజన) ప్రాంతాల్లో పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువగా, మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతోంది.
ఇలా వ్యాపిస్తుంది
♦ ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొరికి వ్యాధికారక క్రిమి ప్లాస్మోడియా వ్యాప్తి చెందుతుంది.
♦ దోమకుట్టిన 8 నుంచి 12 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
♦ చిన్నపిల్లలకు, గర్భిణులకు ఈ వ్యాధి ప్రమాదకరమైనది.
చికిత్స: మలేరియా వ్యాధిగ్రస్తులు క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనే మందుతో పూర్తి మోతాదులో రాడికల్ చికిత్స చేయించాలి. పీవీ మలేరియాకు 14 రోజులు, పీఎఫ్ మలేరియాకు మూడు రోజుల చికిత్స చేయాలి. మధ్యలో మానేస్తే వ్యాధి తిరగబెడుతుంది.
మలేరియా రాకుండా జాగ్రత్తలు
1. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
2. ఇళ్లలో గోడలపై దోమల మందు చల్లించుకోవాలి.
3. కట్టడాలకు సంబంధించిన నీటి నిల్వలు లేకుండా చూడాలి.
4. అనాఫిలిస్ దోమలు మంచినీటి నిల్వల్లో గుడ్లు పెట్టి, లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారతాయి.
5. దోమతెరలను వాడాలి. ఆరు బయట నిద్రించరాదు.
6. ఖాళీ కడుపుతో మలేరియా చికిత్స మాత్రలు మింగరాదు
7. పూర్తి మోతాదులో మాత్రలు మింగాలి.
Comments
Please login to add a commentAdd a comment