కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 449 మందిలో డెంగీ లక్షణాలు కన్పించాయి. వీరిలో 322 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 134 మంది డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడగా అందులో ఐదుగురికి వ్యాధి ఉన్నట్లు ఎలీసా టెస్ట్‌లో బయటపడింది. ఐదులో ఒకటి గత నెల, మిగిలినవి జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు, నన్నూరు, కడుమూరు, ప్రాతకోట, కొత్తబురుజు, క్రిష్ణగిరి, పుచ్చకాయలమడ, నందవరం, శిరువెళ్ల, నంద్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కేసులు నమోదు కాగా, కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. కాగా డెంగీ వ్యాధి లక్షణాలతో కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం గ్రామంలో గొల్ల లీలావతి(27), నందికుంట గ్రామానికి చెందిన లక్ష్మిదేవి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అధికారుల లెక్కల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా చనిపోలేదు.
జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని, ఎమ్మిగనూరుఏరియా ఆసుపత్రులు, నంద్యాల జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. ఇవి గాక 800 దాకా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లోని వైద్యుల వద్దకు ప్రస్తుతం వస్తున్న రోగుల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇదే క్రమంలో మలేరియా, డెంగీ కేసులూ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ కేసులు పక్కనున్న అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల నుంచి అధికంగా కర్నూలులోని ఆసుపత్రులకు వచ్చేవి. ఈసారి ఆయా జిల్లాలతో పాటు జిల్లాలోని రోగులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలోనూ మలేరియా కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత ఏడాది 91మందికి మలేరియా నిర్ధారణ అయ్యింది. ఈసారి ఇప్పటి వరకు 37 మందిలో గుర్తించారు. ఇందులో ప్రమాదకరమైన పాల్సీఫారమ్ మలేరియా తొమ్మిది మందికి ఉన్నట్లు గుర్తించారు.
అధికారులు..ప్రైవేటు ఆసుపత్రుల మధ్య పేచీ
అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా డెంగీ నిర్ధారణ కాగానే చికిత్స ప్రారంభిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వస్తే తమకు సమాచారం అందించాలని, ఈ మేరకు రక్తం సీరా తీసి కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌కు పంపితే అసలు డెంగీనో, కాదో నిర్ధారణ చేస్తామని చెబుతోంది. ఇక్కడి నివేదిక ఆధారంగా మాత్రమే డెంగీగా ప్రకటించాలని ఆసుపత్రులకు స్పష్టం చేస్తోంది. అయితే.. కేఎంసీలోని ల్యాబ్‌కు వెళ్లి రిపోర్ట్ రావాలంటే 15 నుంచి 30 రోజులు పడుతుందని, ఈలోగా రోగికి చికిత్స చేయకుండా ఆపాలా అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో నిమిత్తం లేకుండా వారు డెంగీ లక్షణాలున్న వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు వైద్యులు మాత్రం సాధారణ జ్వరానికి సైతం డెంగీ పేరు చెప్పి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
డెంగీ ఎలా సోకుతుందంటే..
ఏడిస్ ఈజిపై్ట అనే దోమకాటు వల్ల డెంగీ సోకుతుంది. ఈ దోమ ఒంటిపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. అందుకే దీనిని పులిదోమ అని కూడా అంటారు. ఇది శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదమైన రెండు గంటల వరకు, సూర్యోదయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది కేవలం రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. ఇది తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లకు పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక దాక్కుంటాయి.
దోమల నివారణ చర్యలు చేపట్టాం
జులై ఒకటి నుంచి 9 మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్‌ల ద్వారా దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ప్రతి క్లినిక్‌లో ఎంపీహెచ్‌ఈవో, ఎంపీహెచ్‌ఎస్, హెల్త్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది ఉంటారు. వీరు ఇంటింటికి వెళ్లి పరిసరాలు పరిశీలించి నీటిలో లార్వా ఉందో..లేదో పరిశీలించి చర్యలు చేపడతారు. జ్వరపీడితులుంటే రక్తపూతలు సేకరించి పరీక్షలకు పంపిస్తారు. మలేరియాలో పాల్సిఫారమ్ నమోదైతే వ్యాధిగ్రస్తుని ఇంటి పరిసరాల్లో డీటీటీ స్ప్రే చేస్తారు. ఇప్పటి వరకు పాల్సీఫారమ్ మలేరియా నమోదైన 15 గ్రామాల్లో 50 శాతం డీటీటీ స్ప్రే చేశాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తమ జేఈవీఎం యూనిట్ సిబ్బంది వార్డులు తిరిగి డెంగీ, మలేరియా లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. – డేవిడ్‌రాజు, మలేరియా నియంత్రణాధికారి
డెంగీ పేరుతో భయపెడితే చర్యలు
ర్యాపిడ్ టెస్ట్‌లోనే డెంగీగా నిర్ధారించి రోగికి నేరుగా చెప్పకూడదు. ఈ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా, రోగి రక్తాన్ని కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజి ల్యాబ్‌కు పంపించాలి. అక్కడ ఎలీసా టెస్ట్‌లో వ్యాధి నిర్ధారణ అయితేనే డెంగీగా నిర్ధారించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను ధిక్కరించే ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తీసుకుంటాం. 20వేల కంటే తక్కువగాసంఖ్య ఉంటేనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. సాధారణ జ్వరంలోనూ ప్లేట్‌లెట్లు తగ్గుతాయని ప్రజలు గుర్తించాలి. – డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్‌వో, కర్నూలు
వ్యాధి లక్షణాలు
తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లలో రక్తం స్రవిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment