♦ రూ. 52 కోట్లకు ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ టెండర్ ఖరారు.. సీఎం వద్దకు ఫైలు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఆయిల్‌ఫాం క్రషింగ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల టెండర్‌ను మలేసియాకు చెందిన ప్రీ-యూనిక్ ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ఆయిల్‌ఫెడ్ నిర్వహించిన ఆన్‌లైన్ గ్లోబల్ టెండర్లలో ఆ కంపెనీ రూ. 52.19 కోట్లు కోట్‌చేసి టెండర్ దక్కించుకుందని ఆయిల్‌ఫెడ్ అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. భవనాలు సహా మొత్తం ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 80 కోట్ల మేరకు ఖర్చు కానుండగా.. అందులో మలేసియా కంపెనీ ఫ్యాక్టరీకి అవసరమైన అత్యాధునిక యంత్రాలను మాత్రమే సరఫరా చేయనుంది. టెండర్ వివరాలు, కంపెనీ ప్రత్యేకతలు తదితర వివరాలతో కూడిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు ఆయిల్‌ఫెడ్ పంపించింది.
సీఎం ఆమోదముద్ర లభించగానే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని విధివిధానాలు ఖరారు చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెబుతున్నారు. పనులు ఏడాదిలోగా పూర్తి కావల్సి ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. ఈ తోటల ద్వారా వచ్చే ఆయిల్ ఫాం గెలల నుంచి పామాయిల్ తీసేందుకు తెలంగాణలో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో మాత్రమే క్రషింగ్ ఫ్యాక్టరీ ఉంది. అయితే తెలంగాణలో పామాయిల్ తోటల విస్తీర్ణం రోజు రోజుకూ పెరుగుతుండడంతో గంటకు 15 టన్నుల క్రషింగ్ సామర్థ్యం మాత్రమే ఉన్న అశ్వారావుపేట ఫ్యాక్టరీపై అధిక భారం పడుతోంది.
ఈ నేపథ్యంలో మరో క్రషింగ్ ఫ్యాక్టరీని దమ్మపేటలో ఏర్పాటు చేయాలని గతేడాది సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దమ్మపేటలో మలేషియాకు చెందిన ప్రీ-యూనిక్ ఇంజినీరింగ్ కంపెనీ అత్యాధునిక అత్యంత అధిక సామర్థ్యంతో యంత్రాలను ఏర్పాటు చేయనుంది. దాని సామర్థ్యం గంటకు 30 టన్నులు కాగా... రాబోయే రోజుల్లో పెరిగే అవసరాలకు అనుగుణంగా 60 టన్నుల వరకు ఆధునీకరించుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే పదేళ్ల వరకు కూడా అక్కడి డిమాండ్ మేరకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
మలేసియా కంపెనీకి ‘దమ్మపేట’ టెండర్
Published Tue, Oct 20 2015 3:46 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement