ఖమ్మం అర్బన్ : '92 దేశాల్లోని 142 ప్రముఖ కంపెనీల్లో పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం కల్పిస్తాం' అని బోర్డు పెట్టి 4 నెలల కిందట ఖమ్మంలో ఓ వ్యక్తి సంస్థను నెలకొల్పాడు. చాలామందిని నమ్మబలికి లక్షలు వసూలు చేసి, ఇంటి అద్దె కూడా చెల్లించకుండా ఉడాయించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ కన్సల్టెంట్ సంస్థ నిర్వాకం వెలుగుచూసింది. ఎక్సాల్ట్‌సాస్ట్ సొల్యూషన్స్ పేరుతో తిరుపతి సమీపంలోని నారాయణపురానికి చెందిన డి.విశ్యప్రసాద్ ఎండీ అండ్ చైర్మన్ గా నాలుగు నెలలు కిందట సంస్థను ప్రారంభించారు. మమత వైద్యశాల రోడ్డులోని వైపీరెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని 5వ అంతస్తులో కార్యాలయం (నెలకు రూ.8 వేల అద్దె) ప్రారంభించారు. కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) ప్రకటన ఇచ్చాడు.
నిరుద్యోగులు అతడి మాటలు నమ్మి రూ.లక్షలు చెల్లించారు. విద్యార్హతను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించాడు. ఉద్యోగం అడిగితే నేడు, రేపు అంటూ కాలం గడిపాడు. 10 రోజుల కిందట ఇంటికి, కార్యాలయానికి తాళం వేసి తెరవకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగేంద్రచారి, ఎస్సై మెగిలి సోమవారం కార్యాలయం నిర్వహించిన గది, నివాసం ఉన్న ఇంటిని పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25 మంది వద్ద రూ.కోటి పైగానే వసూలు చేసినట్లు తెలిసింది. తమకు కూడా 2 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని కార్యాలయ సిబ్బంది వాపోయారు. కాగా కార్యాలయంలోని రికార్డులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగేంద్రచారి తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం
Published Mon, Oct 17 2016 6:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement
Advertisement