
నిందితుడిని చూపిస్తున్న సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్(స్వాధీనం చేసుకున్న నగలు)
నేరేడ్‌మెట్: సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమ్మాయిలను నమ్మబలికి బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్న ఓ వ్యక్తిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 4 లక్షల విలువ గల 18 తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాయుపురిలోని డీసీపీ కార్యాలయంలో శుక్రవారం సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా ఒధాల మండలం గుంపుల్ల గ్రామానికి చెందిన రేవల్లె స్వరాజ్ (32) బీటెక్ మధ్యలో మానేశాడు. కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చి పేట్ సుచిత్ర చౌరస్తాలో నివాసముంటూ ఎలక్ట్రానిక్ వ్యాపారం చేస్తున్నాడు.
వ్యసనాలకు అలవాటు పడ్డ స్వరాజ్ ఇందుకు అవసరమైన డబ్బు కోసం అమ్మాయి నగల దోపిడీకి పథకం వేశాడు. ఇందులో భాగంగా అమీర్‌పేట మైత్రివనమ్, ఎస్‌ఆర్ నగర్‌ల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం వెతికే అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు. తన సోదరి సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ హెడ్‌గా పని చేస్తోందని, ఆమెకు చెప్పి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికేవాడు. వారిని రాత్రి సమయంలో ఆటోలో ఘట్‌కేసర్, పోచంపల్లి, దుండిగల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల పరిసరాలకు తీసుకెళ్తాడు.
అక్కడ వారిని భయపెట్టి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుంటాడు. బాధితులు తిరగబడితే లైంగికదాడికి పాల్పడతానని బెదిరించేవాడు. నగలు తీసుకొని వారిని అక్కడే వదిలి పారిపోయేవాడు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఓ బాధితురాలు ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు స్వరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాల చిట్టా విప్పాడు. ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో 6, దుండిగల్ పరిధిలో 2 ఘటనలకు పాల్పడినట్టు వెల్లడించాడు. పోలీసులు అతడి వద్ద నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్వరాజ్‌ను రిమాండ్‌కు తరలించారు.