ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Published Sun, Aug 28 2016 12:54 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
నెల్లూరు (క్రైమ్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి శనివారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. వెంగళ్‌రావ్‌నగర్ సిబ్లాక్ తాతయ్యబడి సమీపంలో నివాసం ఉంటున్న కె. శ్రీనివాసులు (36) నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. 12 ఏళ్ల కిందట ఉమతో వివాహమైంది. వారికి పిల్లలు లేకపోవడంతో ఐదేళ్ల కిందట ఆమె అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అతనికి రెండేళ్ల కిందట బోడిగాడితోటకు చెందిన మంజులతో వివాహం చేశారు. ఇటీవల శ్రీనివాసులు గూడూరులో ఓ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని తన పేరుపై రాయమని మంజుల ఒత్తిడి చేసింది. ఆ స్థలాన్ని సగం తనను చిన్నతనం నుంచి పెంచిన తల్లి, చెల్లెలు స్వాతిపై, మిగిలిన స్థలాన్ని ఆమె పేరుపై రాస్తానని భార్యకు చెప్పాడు. ఈ విషయంపై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. రెండు రోజుల కిందట శ్రీనివాసులు తన మరదలు వివాహం నిమిత్తం భార్యతో కలిసి బోడిగాడితోటకు వెళ్లారు. అక్కడ స్థల విషయమై తీవ్ర వివాదం జరిగడంతో భార్యను పుట్టింట్లో వదిలి పెట్టి శుక్రవారం ఇంటికి వచ్చాడు. రాత్రి వరకు చెల్లెలు స్వాతి వద్ద ఉన్నాడు. 10 గంటలకు ఇంటికి చేరుకుని భార్యకు ఫోన్ చేశాడు. వారి మధ్య మరో మారు గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన శ్రీనివాసులు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం పనికి వెళ్లమని చెప్పేందుకు స్వాతి తన అన్న ఇంటి వద్దకు వచ్చి తలుపులు తెరచి చూడగా శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకుని ఉండటానిన గుర్తించి ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ జగత్‌సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement