తాడిచెట్టు పడి వ్యక్తి దుర్మరణం
బాధ్యులు, బాధితుల మధ్య వాగ్వాదం
పరిస్థితి ఉద్రిక్తం
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్
పోలీసుల హామీతో పరిస్థితి ప్రశాంతం
సిరిపురం(కరప) : కరప మండలంలోని సిరిపురం సమీపంలో ఒకరైతు పొలంలో కొడుతున్న తాడిచెట్టు అటుగా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు, వేళంగి, సిరిపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పరిíస్థితి ఉద్రిక్తతగా మారి పోలీసుల జోక్యంతో సమస్య సమసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలం వేళంగి గ్రామానికి చెందిన మెర్ల రాజేంద్రప్రసాద్ పొలంలో బుధవారం రోడ్డుపక్క ఉండే తాడిచెట్లు కొట్టిస్తున్నారు. అదే సమయంలో సిరిపురంలోని అత్తవారింటికి వెళ్తున్న వేళంగికి చెందిన చెరువు దుర్గాప్రసాద్(26)పై చెట్టు పడి అతడు దుర్మరణం పాలయ్యాడు. దుర్గాప్రసాద్ తండ్రి సత్యనారాయణ, బాబాయ్ బదిరెడ్డి వెంకన్న తదితర బంధువులు, వేళంగి, సిరిపురం గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో రైతు, చెట్లు కొడుతున్న కూలీలతో వాగ్వాదం జరిగి అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కరప ఎస్సై మెల్లం జానకీరాం కాకినాడరూరల్ సీఐ పవన్ కిశోర్‌కు సమాచారం అందించారు. అనుమతిలేకుండా ప్రభుత్వ స్ధలంలోని చెట్లుకొట్టడమేకాకుండా, ఒకమనిషి ప్రాణం పోగొడతారా అంటూ గొడవకు దిగారు. ఒకసమయంలో రైతు రాజేంద్రప్రసాద్‌పై ప్రజలు తిరగబడటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కాకినాడ రూరల్, కాకినాడటౌన్ సీఐలు పవన్ కిశోర్, ఎ.సన్యాసిరావు నలుగురు ఎస్‌సైలు, పదిమంది పోలీసులు బందోబస్తుగా ఉండటంతో గొడవ సద్దుమణిగింది.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : కురసాల
కాగా ఈ కేసును తారుమారుచేసే ప్రయత్నం జరుగుతోందని పార్టీకార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా్లఅధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు సమాచారం అందించారు. కన్నబాబు స్పందించి హుటాహుటిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకుని బాధ్యతారాహిత్యంగా చెట్లు నరికించడం వల్లే ఒకనిండుప్రాణం బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దుర్గాప్రసాద్‌కు ఆరునెలల క్రితం వివాహం కావడం, భార్య చాముండేశ్వరి మూడు నెలల గర్భిణి కావడం బాధాకరమైన విషయమన్నారు. కాకినాడ రూరల్ సీఐ పవన్ కిశోర్, స్థానిక నాయకులతో కన్నబాబు చర్చించి, బాధిత కుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలన్నారు. పోలీసులు ఆ మేరకు హామీ ఇవ్వడంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డువద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్టు సీఐ పవన్ కిశోర్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామన్నారు. కరప ఎస్సై జానకిరాం కేసు దర్యాప్తు చేస్తున్నారు.