
అప్పారావు మృతదేహం
పాయకరావుపేట : పెళ్లి సంబరాలతో ఆనందోత్సాహాలు వెల్లివిరియాల్సిన ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. పెళ్లి రాట వేసేందుకు కొమ్మను తీసుకొచ్చేందుకు చెట్టు ఎక్కిన పెళ్లికుమారుడు తండ్రి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలో అరట్లకోట గ్రామానికి చెందిన దేవరకొండ అప్పారావు (60)కు ముగ్గురు కొడుకులు. వీరిలో ఇద్దరికి వివాహాలు చేశాడు. చివరి కొడుక్కి కూడా వివాహం నిశ్చయమైంది. ఈ నెల 27న పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టారు. గురువారం ఇంట్లో పెళ్లిరాట వేయడానికి నిర్ణయించారు. రాట వేసేందుకు అవసరమైన నేరేడు కొమ్మను తెచ్చేందుకు ఉదయం గ్రామంలో చెట్టు ఎక్కి, కొమ్మనరికి దిగబోతున్న సమయంలో కాలు జారి కింద పడ్డాడు.
తలకు బలమైన గాయాలు తగలడంతో కుటుంబ సభ్యులు తుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పారావు రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని పెద్ద కోడలు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తనను ఒక ఇంటివాడిని చేయడం కోసం తపనపడుతున్న తండ్రి కళ్లముందే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పెళ్లికొడుకు చిన్ని కన్నీరుమున్నీరుగా విలపించాడు. అప్పారావు భార్య నాగలక్ష్మి రోదన వర్ణనాతీతం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్‌సీసీ నాయకులు చిక్కాల రామారావు, దగ్గుపల్లి సాయి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment