శ్రీ కొత్త అల్లుడుగారు | Funny laughing story of the week 13-12-2019 | Sakshi
Sakshi News home page

శ్రీ కొత్త అల్లుడుగారు

Published Sat, Jan 12 2019 9:57 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

Funny laughing story of the week 13-12-2019 - Sakshi

చెట్టు మీద ఉన్న శవాన్ని ఎప్పటిలాగే భుజాన వేసుకున్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! ఏదో చెప్పబోవుచున్నావు?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘చెప్పడమా పాడా.... నములుచున్నాను. సంక్రాంతి పిండి వంటలు భలే పసందుగా ఉన్నవి’’ నములుతూనే చెప్పాడు విక్రమార్కుడు.‘‘నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక ప్రశ్న అడుగుతాను. ఓకేనా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఓకే’’ అన్నాడు మురుకులు నములుతూ విక్రమార్కుడు.‘‘విక్రమార్కా! పండక్కి అత్తారింటికి వెళ్లని అల్లుడు ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఉన్నాడంటావా?’’ అడిగాడు భేతాళుడు.‘‘ఎందుకులేడు, ఒకే ఒక్కడున్నాడు’’ అన్నాడు విక్రమార్కుడు అర్ష ముక్క నోట్లో వేసుకుంటూ.‘‘యూ మీన్‌ అర్జున్‌?’’ అన్నాడు భేతాళుడు.‘‘కాదెహే... నేను చెప్పేది చె.చె. గురించి’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘చె.చె? అదేం పేరు!’’ ఆశ్చర్యపడ్డాడు భేతాళుడు.‘‘చెంబూరు చెంగయ్య. షార్ట్‌కర్ట్‌లో చె.చె. అని పిలుస్తుంటారు’’ వివరించాడు విక్రమార్కుడు.‘‘ఈ చెంగయ్య పండక్కి అత్తారింటికి ఎందుకు వెళ్లడు? ఆ కథాకమామిషు ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు:అనగనగా ఒక చెంగయ్య. అతనికి కొత్తగా పెళ్లయింది. పెళ్లయిన కొన్నిరోజులకు పెద్ద పండగ వచ్చింది.‘‘మీరు పండక్కి తప్పనిసరిగా రావాలి అల్లుడు’’ అని గోముగా అడిగాడు మామ.‘‘అలాగే మామయ్య... తప్పకుండా వస్తాను’’ అంటే లెవల్‌ పడిపోతుందని...‘‘అబ్బే! కుదరదు మామయ్య.... బోలెడంత పని ఉంది’’ అబద్ధమాడాడు  చెంగయ్య.‘‘ఓకే అల్లుడూ...పని ముఖ్యం. పని పట్ల నీ శ్రద్ధ నాకు బాగా నచ్చింది. పనికొచ్చే లక్షణం’’ అని నాన్‌స్టాప్‌గా పొగడటం మొదలుపెట్టాడు మామయ్య.ఆయన పొగడ్తల్లో ‘పొగడ్త’ కంటే... ఖర్చు తప్పిందనే సంతోషమే ఎక్కువగా ధ్వనించింది.‘కలికాలం. ఏదో మాట వరసకు పని ఉందంటే, ఖండించాల్సింది పోయి, ఏది ఏమైనా మీరు తప్పకుండా రావాలి అని బతిమిలాడాల్సింది పోయి.... తాపీగా ఓకే అంటాడా’ తనలో తాను కుమిలిపోయాడు చెంగయ్య.

అది పండగరోజు.పెద్ద బ్యాగుతో ఊడిపడ్డ అల్లుడిని చూసి ఆటంబాంబును చూసినట్లు అదిరిపడ్డాడు చెంగయ్య.అయినప్పటికీ ఆ అదురు పాటును ముఖంలో కనిపించకుండా...‘‘చాలా సంతోషంగా  ఉంది అల్లుడు’’ అంటూ మందులో సోడా కలిపినట్లు  నవ్వులో ఏడ్పును కలిపాడు మామయ్య.అల్లుడుగారికి అత్తారింటి మర్యాదలు మొదలయ్యాయి.‘ఆపరేషన్‌ పిండివంటలు’ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతుంది.‘‘నేను పిండివంటలు పెద్దగా తిననండి’’ అంటున్నాడు అల్లుడు. అయినా తింటూనే ఉన్నాడు!‘‘అయ్యో! కడుపు నిండింది’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘‘ఇక చాలు’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.‘చాలు బాబోయ్‌’’ అంటున్నాడు.అయినా తింటూనే ఉన్నాడు.కొద్దిసేపటి తరువాత...అతడి కడుపులో సునామీమొదలైంది.ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అవి ‘స్వచ్ఛ్‌భారత్‌’ ‘ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి’ లేని రోజులు. ఎంతటి మొనగాడైనా చెంబట్టుకొని ఊరవతలికి పోవాల్సిందే.కడుపులో ఏదో కీడు శంకించడంతో తినడం ఆపేశాడు చెంగయ్య.వింటి నుంచి దూసుకొచ్చిన బాణంలా ఇంటి వెనక్కి దూసుకొచ్చి  చెంబు పట్టుకొని అదే వేగంతో వీధిలోకి పరుగులు తీశాడు.ఇప్పుడు మనం పీపారాయుడి గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ రాయుడి ఇంటి ముందు  ప్రతి సంక్రాంతికి గొబ్బెమ్మ పెడతారు. ఇందులో విశేషం ఏముంది అందరి ఇండ్ల ముందు గొబ్బెమ్మలు పెడతారనే కదా మీ డౌటు! కానీ ఊళ్లో ఉన్న గొబ్బెమ్మల కంటే ఈ గొబ్బెమ్మ పెద్దది. ఎత్తయినదీనూ!‘గొబ్బెమ్మ అయినా సరే మన తాహతకు తగినట్లు ఉండాలి’ అంటాడు పీపారాయుడు.మరి అలాంటి గొబ్బెమ్మకు ఏమైంది?ఏమీ కాలేదు... కానీ చెంగయ్యకి అయ్యింది.చెంబుతో పరుగెత్తుకుంటూ వస్తున్న చెంగయ్య  పీపారాయుడి గొబ్బెమ్మను తాకి బొక్కబోర్లా పడ్డాడు. పడితే పడ్డాడు... కానీ అతని చేతిలోని చెంబు వెళ్లి పీపారాయుడి బట్టతల మీద పడింది.పడితే పడింది కాని చెంబుదెబ్బకు  పీపారాయుడి మతి చలించింది.అతని నోటి నుంచి వింతవింత మాటలు వినిపిస్తున్నాయి.వెంటనే డాక్టర్‌ను పిలిపించారు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైన పని ఏదీ లేదు డాక్టర్‌!’’ అన్నాడు పీపారాయుడు.‘‘ఎవరయ్యా రాయుడిగారికి మతిచలించింది అని చెప్పింది.... శుభ్రంగా మాట్లాడుతుంటేనూ.... ఆయన మాటల్లో పిచ్చి ఎక్కడిది? ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. అంతేగా!’’ భరోసాగా అన్నాడు డాక్టర్‌.‘‘నేను చెప్పినదానితో ఏకీభవిస్తారా డాక్టర్‌?’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత గొప్పగా చెప్పారండీ’’ తన్మయంగా వంకర్లు తిరిగాడు డాక్టరు.

‘‘మీ సూది ఇలా ఇస్తారా డాక్టరు’’ అడిగాడు పీపారాయుడు.‘‘ఎందుకు?’’ భయంగా అడిగాడు డాక్టర్‌.‘‘ఆ సూదిబెజ్జంలో దూరుతాను... ఈ ప్రపంచంలో అసాధ్యమైంది లేదు...’’ అంటున్నాడు రాయుడు.‘‘ఓరి నాయనో...’’ అంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడు డాక్టరు.‘‘మా రాయుడిని విత్‌ ఇన్‌ టెన్‌మినిట్స్‌లో పిచ్చెక్కిస్తావా? నీకు ఎన్ని గుండెలు?’’ అంటూ చెంగయ్యను చావబాదడమే కాకుండా, ‘‘ఇక ముందు ఎప్పుడూ మా ఊళ్లోకి అడుగుపెట్టవద్దు’’ అని శాసనం చేశారు ఊరి ప్రజలు. ఇక అప్పటి నుంచి అత్తింటివారి ఊరి పేరు వింటే చాలు గజగజా వణికిపోతాడు చెంగయ్య!
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement