మెదక్ జిల్లా సంగారెడ్డిలో కలకలం రేగింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్న బీసీ సంఘం నేత సిరిబాబు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో ఆయనకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సిరిబాబు.. ఉన్నట్టుండి వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు.
దాంతో ఆయన కాళ్ల నుంచి పైన పొట్ట వరకు శరీరం కాలిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిరిబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విలేకరులతో మాట్లాడిన సిరిబాబు ప్రవైవేటు పాఠశాలల తీరుపై విరుచుకుపడ్డారు.
నర్సరీకి కూడా 45 వేలు వసూలు చేస్తూ స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఇక భర్తలు లేని మహిళలైతే తమ పిల్లల్ని చదివించుకునేందుకు పడుతున్న బాధలు చెప్పరానివన్నారు. అధిక ఫీజులపై ఎంఈవో, డీఈవోలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఆందోళనను ఉదృతం చేసే క్రమంలో తాను ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందన్నాడు.
సంగారెడ్డిలో ఫీజుల కలకలం..
Published Sat, Aug 1 2015 2:37 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement