ఒంగోలు : భార్యను కాపురానికి పంపిచడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యోహాన్ (29) కు ఎనిమిదేళ్ల క్రితం కర్నూలు జిల్లా నర్సాపురానికి చెందిన యువతితో పెళ్లైంది.
గత కొన్ని రోజులుగా వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో తన భార్యను కాపురానికి పంపాలని యోహాన్ అత్తింటివారింటికి వెళ్లాడు. ఆ క్రమంలో అతడిపై అత్తింటివారు దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంటికి వచ్చి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.