మృతి చెందిన గురులక్ష్మి (ఫైల్) , సూసైడ్ నోట్ , మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ
ప్రకాశం ,తాళ్లూరు: ఆ విద్యార్థిని బీటెక్ చదువుతోంది. నాలుగేళ్లలోపు ఎన్ని సబ్జెక్టులు ఫెయిలైనా మరుసటి ఏడాదికి ప్రమోట్ చేస్తారు. అంత వరకూ ఓకే. బీటెక్ చదువుతున్న విద్యార్థిని మొదటి ఏడాదిలోనే తొమ్మిది సబ్జెక్టులు తప్పింది. ఇందుకు తల్లిదండ్రులు ఆమెను ఏమీ అనలేదు. దీన్నే ఆ విద్యార్థిని సీరియస్‌గా తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందింది. చిన్న సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని తురకపాలెంలో శుక్రవారం జరగగా ఆదివారం వెలుగు చూసింది.
వివరాలు.. తురకపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సూరా సుబ్బులు మనుమరాలు, వెంకటరెడ్డి కుమార్తె గురులక్ష్మి (20) గుంటూరు జిల్లా తెనాలిలోవని ఓ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతోంది. ఈ నేపథ్యంలో గురులక్ష్మి ఫస్టియర్‌లో తొమ్మిది సబ్జెక్టుల్లో ఫెయిలైంది. అయినా తల్లిదండ్రులు పల్లెత్తు మాటనలేదు. దీనికి విద్యార్థిని మరింత మనస్తాపం చెందింది. శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందింది. ఎస్‌ఐ రంగనాథ్ తన సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వైఎస్సార్ సీపీ నేతల సంతాపం
ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సూరా సుబ్బులు మనుమరాలు మృతి చెందిన వార్తతో వైఎస్సార్ సీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. అందరితో సఖ్యతగా ఉంటూ నలుగురిని నవ్విస్తూ ఉండే గురులక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని నేతలు వ్యాఖ్యానించారు. ఆమె మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బాదం మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ రమా వెంకటేశ్వరరెడ్డిలు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment