–కాపులను బీసీలో చేర్చొద్దంటూ ప్రజా సంఘాల ఆందోళన
- బీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసా
– సంఘాలు సహకరించకపోవడంతో విచారణ వాయిదా
కర్నూలు(హాస్పిటల్): కాపు, బలిజలను బీసీ కేటగిరిలో చేర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌చే నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసాగా మారింది. సోమవారం బీసీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో కార్యక్రమం ప్రారంభం కాకుండా సంఘాల నాయకులు అడ్డుతగిలారు. బీసీ కమిషన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అరుపులు, కేకల మధ్య విచారణ కొనసాగించలేనని కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అన్యాయం చేసే బహిరంగ విచారణ తమకు వద్దంటూ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముందుగా యాదవ కులంలో గ్రూపులను మార్చాలంటూ వచ్చిన అభ్యంతరాలపై విచారణ ప్రారంభిస్తానని కమిషన్ చైర్మన్ చెప్పగానే చిన్నహాలులో 150 బీసీ కులాలకు సంబంధించి విచారణ చేపట్టి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హాలు బయట ఇంకా 2వేల మంది దాకా ఉన్నారని, వారందరి సమక్షంలో విచారణ జరిపితే న్యాయం జరుగుతుందన్నారు. ఇందుకోసం హాలు బయట కూడా మైకులు ఏర్పాటు చేశామని కమిషన్ చెప్పినా సంఘాల నాయకులు శాంతించలేదు. కమిషన్ ఎప్పటికీ బీసీలకు వ్యతిరేకం కాదని చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రశాంత వాతావరణం లేకపోతే బహిరంగ విచారణ చేయడం కుదరదని, సంఘాల నాయకులు సహకరించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతిలో బీసీల రిజర్వేషన్‌పై విచారణ చేస్తామన్నారు. ఇదే సందర్భంగా సంచార జాతులకు చెందిన సుంకులమ్మ కులం వారు వచ్చి డోలు వాయిస్తూ, కొరడాలతో నాట్యం చేస్తూ నిరసన తెలిపారు. గంగిరెద్దు ఆడించేవారు సైతం హాలులోకి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సంఘాల నాయకులు, సభ్యుల నినాదాల మధ్య కమిషన్ చైర్మన్ బహిరంగ విచారణను వాయిదా వేశారు.
వినూత్న నిరసన
కాపులను, బలిజలను బీసీ జాబితాలో చేర్చితే సహించేది లేదని పేర్కొంటూ బీసీ సంఘాల జేఏసీ నాయకులు మెడకు ఉరితాళ్లు కట్టుకుని అంబేడ్కర్ భవన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గేట్లను తోసుకుని బహిరంగ విచారణ జరిగే హాలులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ, బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, కులాల ఐక్య వేదిక మహిళా నాయకురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చితే ఇప్పుడున్న బీసీలకు ఉరితాళ్లే గతవుతాయన్నారు. అన్ని రంగాల్లో కాపులు అభివృద్ధి చెందారని, కాపులు బీసీలే కాదని గతంలో ఏర్పాటు చేసిన అన్ని కమిషన్లు, హైకోర్టు తేల్చి చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసేందుకు మంజునాథ్ కమిషన్ వేశారన్నారు.
ఈ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అగ్రకులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బహిరంగ విచారణ వాయిదా వేసి, కాపు కులాల అభ్యర్థనలను ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాపు, బలిజ కులాలకు చెందిన నాయకులు, సభ్యులు ప్రతినినాదాలు చేశారు. కమిషన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కమిషన్ విచారణ వాయిదా వేసింది. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షులు భరత్‌కుమార్, బీసీ జనసభ నాయకులు టి.శేషఫణి, మాకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆరే కటిక కులాన్ని బీసీ–డీ నుంచి ఎస్సీలో చేర్చాలని కోరుతూ జిల్లా ఆరే కటిక సమాజ్ నాయకులు కృష్ణాజిరావు, నాగేశ్వరరావు, చలపతిరావు తదితరులు డిమాండ్ చేశారు. సంచార జాతులైన బుడగ జంగాలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంచార జాతుల వేదిక కమిటీ అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ కోరారు. భావసార క్షత్రియులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని భావసార క్షత్రియ మండలి జిల్లా నాయకులు ధర్నా చేశారు.
సంఘాలు సహకరించకపోవడంతోనే విచారణ వాయిదా
బీసీ సంఘాలు సహకరించకపోవడం వల్లే బహిరంగ విచారణ వాయిదా వేశామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. విచారణ వాయిదా అనంతరం ఆయన ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు సంబంధించి ఏ కులం వారైనా అభ్యర్థనలను విజయవాడలోని బీసీ కమిషన్ కార్యాలయానికి వచ్చి అందజేయవచ్చన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదన్నారు. 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్ జిల్లాల్లో పర్యటిస్తోందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవనవిదానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సూర్యనారాయణ, కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ పాల్గొన్నారు.