
కాపులను బీసీలో చేర్చేలా సర్కారుపై ఒత్తిడి తెండి
విజయమ్మకు కాపు జేఏసీ నేతల వినతి
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల జాబితాలో చేరుస్తూ 1994లో జారీ అయిన జీవో (నంబర్ 30) నేటికీ అమలు కావట్లేదని..ఈ జీవోను ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తెలగ, బలిజ, కాపు జేఏసీ నేతలు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని వినతిపత్రం సమర్పించింది. ఈ డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్ నుంచి తమ సంఘాలన్నీ 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నాయని ప్రతినిధి బృందం తెలిపింది. ఈ విషయంలో తప్పకుండా కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. విజయమ్మను కలిసిన వారిలో కాపు సద్భావనా సంఘం(తూ.గో) నాయకుడు వాసిరెడ్డి ఏసుదాస్, బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షుడు (కర్నూలు) సింగంశెట్టి సోమశేఖర్, శ్రీనివాస్, స్వరూప్ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్‌టీఎఫ్ డైరీ ఆవిష్కరణ
ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ డైరీ (2014)ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం ఆవిష్కరించారు. ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి, కమిటీ సభ్యులు కె.జాలిరెడ్డి, పి.రామసుబ్బారావు, అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన 11 సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ ఆమెకు వినతిపత్రం అందజేశారు.