బీసీలకు పల్స్ సర్వే వేరుగా నిర్వహించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు
అరండల్‌పేట: మంజూనాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణను కలిపి నిర్వహించడంతో బీసీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపలేకపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు బ్రాడీపేటలోని రాష్ట్ర సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వంటి పట్టణంలో పోలీసు బందోబస్తు మధ్యలో మంజునాథ కమిషన్ సమక్షంలో బీసీలపై దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దౌర్జన్య వాతావరణంతో గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలు కమిషన్ వద్దకు వచ్చి తమ బాధలన చెప్పుకోవడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చురేపుతుందని మండిపడ్డారు. విలేకర్ల సమావేశంలో బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, నాయకులు అంగిరేకుల ఆదిశేషు, టీ శ్రీనివాస్‌యాదవ్, ఓలేటి శివాజీ, ఆలా అనంతరామయ్య, కుందుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.