
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
రైల్వేకోడూరు పట్టణంలోని పగడాలపల్లెలో నివాసముంటున్న కరమళ్ల అలిషా(25) అనే వివాహిత యువతి ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం మేరకు..
రైల్వేకోడూరు రూరల్:
రైల్వేకోడూరు పట్టణంలోని పగడాలపల్లెలో నివాసముంటున్న కరమళ్ల అలిషా(25) అనే వివాహిత యువతి ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం మేరకు..పగడాలపల్లెకు చెందిన మస్తాన్‌కు మంటపంపల్లెకు చెందిన గుర్రప్ప, మాబున్నీల కుమార్తె కరమళ్ల అలిషాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల క్రితం మస్తాన్ కువైట్‌కు వెళ్లాడు. అప్పటి
నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్లేవాడు. అలిషాకు తోడుగా మస్తాన్ తన అమ్మను ఉంచాడు. కింది ఇంట్లో అలిషా ఉండగా, పై ఇంటిలో మస్తాన్ అన్న, వదినలు ఉంటున్నారు. ఇటీవల కొంత కాలంగా అలీషాకు పిల్లలు లేరని గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో కువైట్ నుంచి అలిషాకు ఆమె భర్త ఫోన్ చేసి పరుషంగా మాట్లాడటంతో ఆమె
విలపిస్తూ కువైట్‌లోనే ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది. అదే రోజు రాత్రి ఆమె ఉరివేసుకుందనే సమాచారం అందిందని మృతురాలి బంధువులు పేర్కొంటున్నారు. తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శరీరంపై గాయాలు ఉన్నాయని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె మరణ వార్త తెలిసిన వెంటనే కువైట్‌లో ఉన్న మృతురాలి తల్లిదండ్రులు సోమవారం
పగడాలపల్లెకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఆమె భర్త మాత్రం కువైట్ నుంచి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.