వివాహిత అనుమానాస్పద మృతి
Published Thu, Feb 16 2017 12:20 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
- అదనపు కట్నం కోసం హత్య చేశారంటున్న బంధువులు
- మృతురాలిది సున్నిపెంట
మార్కాపురం టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నీలకంఠయ్య వీధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి ఖాదర్‌బీ కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే షేక్ గౌస్‌కు కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన ఖాదర్ బీ కుమార్తె రహమత్‌బీ(24)తో రెండున్నరేళ్ల కిందట వివాహమైంది. కట్నంగా రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు ఇచ్చారు. ఇటీవల అదనపు కట్నం కావాలంటూ రహమత్‌బీని ఆమె భర్త వేధించాడు. ఈ విషయంపై పెద్ద మనుషులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఈలోపే రహమత్‌బీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం ‘మీ కుమార్తెకు ఫిట్స్ వచ్చి చనిపోయింది.’ అని ఖాదర్‌బీకి అల్లుడి తరఫు బంధువులు ఫోన్ చేశారు. మృతదేహం మెడపై గాయాలున్నాయి. బంధువులు వచ్చేలోపే మృతదేహాన్ని ఐస్ బాక్స్‌లో పెట్టారు. తన కుమార్తెకు గతంలో ఎప్పుడూ ఫిట్స్ రాలేదని, అల్లుడే కుమార్తెను చంపాడని ఖాదర్‌బీ కన్నీటిపర్యంతమైంది. అమ్మాయి తరఫు బంధువులు గౌస్, ఆయన బంధువులపై దాడికి ప్రయత్నించడంతో వారు పరారయ్యారు. మృతురాలికి ఏడాది వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. మార్కాపురం ఎస్‌ఐ సుబ్బారావు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement