
సావిత్రి (ఫైల్)
కడప అర్బన్: కడపలోని అలంఖాన్‌పల్లి దస్తగిరిపేటకు చెందిన సావిత్రి(21) అనే మహిళ వివాహమైన మూడు నెలలకే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఈ నెల 25వ తేదీ రాత్రి చోటుచేసుకుంది. మృతురాలి తల్లి పల్లపు నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన పల్లపు నాగలక్ష్మమ్మ రెండో కుమార్తె సావిత్రి(21)ని కడప అలంఖాన్‌పల్లి దస్తగిరిపేటకు చెందిన ప్రతాప్‌కు ఇచ్చి ఈ ఏడాది జనవరిలో వివాహం చేశారు.
కువైట్ నుంచి వచ్చిన వెంటనే ఆమెను వివాహం చేసుకున్న ప్రతాప్.. అదనపు కట్నం కోసం వేధిస్తుంటే మూడు వారాల క్రితం పుట్టింటికి వెళ్లింది. వారం క్రితం ప్రతాప్ అత్తారింటికి వెళ్లాడు. తన భార్యను పంపించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించి.. ఆమెను తీసుకుని వచ్చాడు. తర్వాత తల్లి వెంకటమ్మ, చెల్లెలు రాజితో కలిసి భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో ఆమె ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలాన్ని సోమవారం కడప డీఎస్పీ బూడిద సునీల్, సీఐ నాగభూషణం, ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
నిందితుడికి ఇది మూడో వివాహం
నిందితుడైన ప్రతాప్‌కు సావిత్రి మూడో భార్య కావడం గమనార్హం. 2003లో చెన్నూరు మండలం ఖాదర్‌ఖాన్ కొట్టాలుకు చెందిన మల్లేశ్వరిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను వేధింపులకు గురి చేయగా, వాస్మోల్ ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత కోర్టులో కేసు రాజీ అయ్యారు. రెండో వివాహం సావిత్రి అక్క సంజీవరాణిని చేసుకున్నాడు. కొన్ని రోజులకే భర్తతో మనస్పర్థలు ఏర్పడి దూరంగా ఉంటోంది. రెండేళ్ల క్రితం ప్రతాప్ కువైటుకు వెళ్లాడు. అక్కడి నుంచి సావిత్రితో ఫోన్లో మాట్లాడుతూ ప్రేమాయణం సాగించాడు. ఈ ఏడాది జనవరిలో ఆమెను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించి ఆత్మహత్యకు కారణమయ్యాడు.
చదవండి:
ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు
దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు..
Comments
Please login to add a commentAdd a comment