'కేంద్ర నిధులను సద్వినియోగం చేయండి'
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సద్వినియోగం చేసి ప్రాజెక్టులు పూర్తిచేస్తే మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు సూచించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు చేపట్టిన వికాస్‌పర్వ్పై బుధవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో హరిబాబు మాట్లాడారు. ఈ ప్రచారం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి, నెల్లూరులో కేంద్ర మంత్రులు పర్యటించి కేంద్రం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు.
అలాగే ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల ఆగిన బిల్లులు, అవి చట్టరూపం దాల్చకపోవడంతో అభివృద్ధికి కలుగుతున్న అడ్డంకులను కూడా ఈ కేంద్ర మంత్రులు తెలియ జేస్తారని చెప్పారు. ఏపీ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్, రైల్వేజోన్ వంటి 4 ప్రధాన అంశాలపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని హరిబాబు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనం కంటే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా కేంద్రం వ్యవహారిస్తుందన్నారు.
నీతి అయోగ్ సూచించిన రూ.2,500 కోట్లలో ఇప్పటివరకు రూ.1,950 కోట్లను నూతన రాజధానికి అందించినట్లు హరిబాబు వెల్లడించారు. నీతి అయోగ్ అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010. 45 కోట్లని, జాతీయ ప్రాజెక్ట్ అయినందున ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉందన్నారు. కానీ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కృషి ఫలితంగా కేంద్రం వంద శాతం భరించేందుకు నిర్ణయించిందని ఆయన వివరించారు.
ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం ఇప్పటివరకు మొత్తం రూ.850 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైల్వే జోన్ కోసం బీజేపీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వికాస్‌పర్వ్ కార్యక్రమం పూర్తి కాగానే రైల్వే మంత్రిని కలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, కొచ్చర్లకోట లక్ష్మీపతిరాజా తదితరులు పాల్గొన్నారు.