పంటను కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
జమ్మలమడుగు/పెద్దముడియం: పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు సంబంధించిన శనగ పంటను కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హనుమంతరెడ్డి, పోరెడ్డి మహేశ్వరరెడ్డి బాధితులతో కలిసి రూరల్ స్టేషన్‌లో సీఐ మురళినాయక్‌తో మాట్లాడారు.లక్షలు పెట్టుబడులు పెట్టి భూములు కౌలుకు తీసుకొని సాగుచేసిన శనగ పంటను రాత్రికి రాత్రే కాల్చివేడయం దారుణమన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన ఏ వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడరని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందని, వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తే దానికి పోలీసులు సహకరించడం వల్ల తిరిగి గ్రామాల్లో ఫ్యాక్షన్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామ నాయకుడు చక్రపాణి రెడ్డి అతని అనుచరులు కాల్చారంటూ రూరల్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కక్షతోనే పంటను కాల్చేశారు..
తాను వైఎస్సార్‌సీపీకి మద్దతు దారుడిగా ఉన్నానని, ఆర్థికంగా దెబ్బతియాలనే ఉద్దేశంతోనే దాదాపు రూ. 12 లక్షల విలువగల శనగ పంటను కాల్చేశారని బాధితుడు శేఖర్‌రెడ్డి వాపోయారు. తనపై కుట్ర పని మొత్తం 29 ఎకరాల పంటను కాల్చిబూడిదచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చక్రపాణిరెడ్డి, రామసుబ్బయ్య, రామచంద్రుడు ,వెంకటేశ్వర్లు, గంగాధర్‌లు కాల్చేశారని కన్నీంటిపర్యంతమయ్యారు.
కఠిన చర్యలు తీసుకుంటాం– డీఎస్పీ
తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ టి.సర్కార్ అన్నారు. సోమవారం ఆయన కల్వటాల గ్రామంలో తగులబడిన శనగ పంటను పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు.