- తనిఖీలు ముమ్మరం చేస్తాం..
- ఉన్నత విద్య ఆర్‌జేడీ దర్జన్
కళాశాల విద్య పటిష్టతకు చర్యలు
Published Sat, Aug 20 2016 12:25 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
విద్యారణ్యపురి : తెలంగాణ లోని ఐదు, ఆరో జోన్ల ఉన్నత విద్య(డిగ్రీ కళాశాలలు) ఆర్‌జేడీగా ఖమ్మంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.దర్జన్‌కు పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా రెండు రోజుల క్రితం ఆమె హన్మకొండలోని ఉన్నత విద్య ఆర్‌జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఇన్‌చార్జి ఆర్‌జేడీ(ఫుల్ అడిషనల్ చార్జి)గా దర్జన్ 2008 నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు రెగ్యులర్ ఆర్‌జేడీగా పదోన్నతి కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు, ఆరో జోన్ల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. కళాశాలల పటిష్టానికి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. కళాశాలల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని, అధ్యాపకులు సమయపాలన పాటించాలని సూచించారు. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా ఇన్‌చార్జి ఆర్‌జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనకు కళాశాలల పరిస్థితిపై అవగాహన తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటుచేయించామని పేర్కొన్నారు. అలాగే, ఆన్‌లైన్ పద్ధతిలోనే డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. కాగా, ఐదు, ఆరో జోన్ల పరిధిలో పనిచేస్తున్న సుమారు 800 మంది కాంట్రాక్చువల్ లెక్చరర్లను వారం రోజుల్లో ప్రభుత్వం రెన్యువల్ చేయనుందని దర్జన్ వివరించారు.
ఆదిలాబాద్‌లో లెక్చరర్‌గా నియామకం
ఖమ్మం జిల్లా గోవిందరాలకు చెందిన డాక్టర్ బి.దర్జన్ తొమ్మిదో తరగతి వరకు అక్కడే చదువుకోగా, పదో తరగతి కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌లో పూర్తిచేశారు. ఖమ్మంలోనే ఇంటర్, డిగ్రీ, ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్, కేయూలో ఎకనామిక్స్‌లో ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనంతరం 1987లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా నియామకమయ్యారు. 2007 సంవత్సరంలో ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందిన దర్జన్ అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా 2008లో హన్మకొండలోని ఐదు, ఆరో జోన్ల(డిగ్రీ కళాశాలల) ఉన్నత విద్య ఆరేజేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
2007సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలుగా ఎంపికైన ఆమె అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఎనిమిదేళ్లుగా ఇన్‌చార్జి ఆర్‌జేడీగా ఉన్న దర్జన్‌కు రెగ్యులర్ ఆర్‌జేడీ పదోన్నతి దక్కింది. ఆర్‌జేడీగా బాధ్యతలు స్వీకరించిన దర్జన్‌కు ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది. కాగా, దర్జన్ భర్త డాక్టర్ పాపాలాల్ ఖమ్మం నగర మేయర్‌గా ఉన్నారు.
Advertisement
Advertisement