మెదక్ ఏరియల్ వ్యూ
- దసరా నుంచి కొత్త జిల్లాలోనే పాలన
- దశాబ్దాల కల నెరవేరిన వేళ
- నేడు పట్టణంలో సంబురాలు
మెదక్: ప్రత్యేక జిల్లాగా మెదక్ ఏర్పాటు కానుండటంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. దశాబ్దాల కళ ఇప్పటికీ నెరవేరడంతో సంబరపడిపోతున్నారు. ఒకప్పుడు నాలుగు జిల్లాలకు సుభాగా మెదక్ వర్ధిల్లినట్లు చరిత్ర చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మెదక్‌ను జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగించారు.
జిల్లా సాధన సమితి పేరిట ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రత్యేక జిల్లా కోసం ఓ ఉద్యమ కమిటీ సభ్యుడు సైతం ఆమరణ నిరహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజల ఇబ్బందుల వర్ణాణాతీతం. ప్రత్యేక జిల్లా కోసం దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు పోరాటాలు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో సైతం ఈ ప్రాంత ప్రజలు సకల జనుల సమ్మెలో పాల్గొంటూనే ప్రత్యేక జిల్లా కోసం ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు 2014 డిసెంబర్ 17న మెదక్‌కు వచ్చిన సందర్భంగా సభలో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ బహిరంగ ప్రకటన చేశారు.
దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షాతీరేకాలు వెలిబుచ్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే ‘మెదక్ జిల్లా’ కోసం ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు అందరి కల సాకారమయ్యే క్షణాలు సమీపిస్తున్నాయి.
కొత్త జిల్లాలో మండలాలివే..
దసరా నుంచి ఏర్పాటు కానున్న మెదక్ నూతన జిల్లాలో మెదక్, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొత్తగా ఆవిర్భవించిన హవేళిఘణాపూర్, వెల్దుర్తి, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, చేగుంట, తూప్రాన్, పెద్దశంకరంపేట, టేక్మాల్,అల్లాదుర్గం, మండలాలతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలాన్ని సైతం మెదక్ జిల్లాలోనే కలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాని అక్కడి ప్రజలు కామారెడ్డి మండలంలోనే ఉంచాలని కోరుతున్నట్లు సమాచారం.
పట్టలేని ఈ సంతోషాన్ని ప్రజలతోనే పంచుకుంటా
ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లాకోసం ఎదురు చూస్తున్నారు. యేళ్లతరబడి ఉద్యమాలు కొనసాగించారు. ఆనాటి పాలకుల స్వార్థంతో జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలో గల సంగారెడ్డికి తరలించారు. ఆనాటి పాలకులు రవాణా అనుకూలంగా చూసుకున్నారే తప్ప. ప్రజల బాగోగులు పట్టించుకున్న సందర్భాల్లేవు.
జిల్లా ఒకచోట, దాని కేంద్రం మరోచోట దేశంలో ఎక్కడలేదు. ప్రత్యేక జిల్లా ఏర్పడితే జిల్లాకేంద్రంలోనే అన్ని శాఖలుంటాయి. దీంతో పాలన మరింత చేరువ అవుతుంది. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రత్యేక జిల్లాకోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. దసరా నుండి కొత్త జిల్లా పాలన మెదక్‌లోనే జరుగనుంది. - డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి