పల్లెకు పండుగ దూరమైంది | medak is full of drought and away from ugadi | Sakshi
Sakshi News home page

పల్లెకు పండుగ దూరమైంది

Published Sat, Apr 9 2016 3:33 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

పల్లెకు పండుగ దూరమైంది - Sakshi

పల్లెకు పండుగ దూరమైంది

మెతుకుసీమను మింగేస్తున్న కరువు రక్కసి
పండుగ సందడి లేదు.. పచ్చటి తోరణం లేదు
ఎక్కడ చూసినా కళ తప్పిన పల్లెలే..
ఎవర్ని కదిపినా కన్నీళ్ల వెతలే..
తాగునీటికి తండ్లాడుతున్న బతుకులు
గోమాత మెడపై కబేళా కత్తి
గడ్డి లేక అమ్ముకుంటున్న రైతన్నలు
పాతాళానికి పడిపోయిన గంగ..
ఎక్కడికక్కడ ఎండిపోయిన బోర్లు
ఉగాది పూట.. ‘సాక్షి’ కరువు బాట

 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
ఎద్దు పోయి ఎవుసం లేక తడకతడకైన పల్లెలు.. తాగునీళ్లకు తండ్లాడి తండ్లాడి పొక్కిలైన బతుకులు.. పండుగ పూట రైతు ఇంట్లో పూజలందుకోవాల్సిన గోమాత సంతలో కన్నీళ్లు పెడుతోంది.. కబేళా కత్తి కింద మెడ పెట్టి మొత్తుకుంటోంది.. అప్పులోళ్ల బాధలైతే ఎప్పటికీ ఒడవని ముచ్చట.. మెతుకుసీమలో పండుగ పూట ఏ పల్లెను పలకరించినా, ఏ రైతు ఇంట్లోకి తొంగి చూసినా ఇదే పరిస్థితి! ఉగాది పండుగంటే పచ్చటి తోరణాలు, షడ్రుచుల పచ్చడి, భక్షాల ఆరగింపు, బండ్ల ఊరేగింపు, కాళ్లకు పారాణితో ఆడపడుచులు, కొత్త బట్టలతో పసిపిల్లల కేరింతలు.. ఇవేవీ కానరావడం లేదు! పండుగన్న సందడే లేదు. ఎటు చూసినా దైన్యమే. ఉగాది పండుగ వేళ పల్లెలను పలకరించేందుకు ‘సాక్షి’ బృందం సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు
 దాదాపు 170 కిలోమీటర్లు ప్రయాణం చేయగా.. ఎక్కడ చూసినా కళ తప్పిన పల్లెలే కనిపించాయి.
 
ఏంజెయ్యాలె బిడ్డా.. కరువు మీద పడె..
సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి బయలుదేరాం.. ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో జెంగిలి శోభ, ఆమె కుమారుడు ఆంజనేయులు, కోడలు, పిల్లలతో ఇంటి ముందు దిగాలుగా కూర్చున్నారు. పండుగ రోజు చిన్నబోయి కూర్చున్నరెందుకమ్మా అని పలకరిస్తే.. ‘‘ఏంజెయ్యాలె బిడ్డా.. కరువు మీద పడె. మూడెకరాల పొలం పెడితే ఇత్తు ఎల్లకపాయే. కైకిలి కూడా దొరుకుతలేదు. చేతుల చిల్లిగవ్వలేదు. పోరగాండ్లు కొత్త బట్టలు కొనియ్యిమని దూందూమ్ చేస్తున్నరు. ఇజ్జతి దీస్తున్నరు. ఏం జేయ్యాలో తోయక అగో నా కొడుకు, కోడలు అందరం ఇడుపులు పట్టుకొని కూసున్నం..’’ అని ఆవేదన వెళ్లగక్కింది. అక్కడ్నుంచి హత్నూర మండలం మంగాపూర్ వెళ్లి రైతు ఒగ్గు సత్యనారాయణను కదిపి చూశాం.

సత్యనారాయణది పెద్ద కుటుంబం, చిన్న ఇల్లు. ఆయన భార్య శశికళ, ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనవలు అందరూ రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు. వారందరికీ కలిపి ఉన్నది రెండెకరాల పొలం ఒక్కటే. ఈ ఏడాది పంట దిగుబడి లేదు. కూలీకి పిలిచే దిక్కులేదు. పండుగ పూట ఈ కుటుంబం అంబటేళ వరకు కూడా పచ్చడి దినుసులు తెచ్చుకోవడం కోసం ఇబ్బంది పడింది. సత్యనారాయణను పలకరిస్తే... ‘‘ఇది ఏం తనువు బిడ్డా.. పండుగ పూట కన్నబిడ్డను ఇంటికి తీసుకొచ్చుకోలేని తండ్రిని. నా బిడ్డ అత్తగారింటికాడ ఎంత ఏడుస్తుందో.. అత్తమామలు ఎన్ని సూటిపోటి మాటలు అంటున్నరో.. మా బతుకులకు తీపి లేదయ్యా...’’ అని కంటనీరు పెట్టుకున్నాడు.
 
ఊరంతటికీ ఒక్క బోరే దిక్కు..
మంగాపూర్ నుంచి నర్సాపూర్ మీదుగా నారాయణ పూర్ గ్రామానికి చేరుకున్నాం. అప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అంబలి తాగి కొంత ఉపశమనం పొందాం. అక్కడ్నుంచి లింగాల గ్రామం వైపు వెళ్తుండగా.. నారాయణపూర్ ఊరి చివర వ్యవసాయ బోరు బావి దగ్గర మహిళలు బిందెలతో కనిపించారు. అది జరుపుల రాంచందర్ వ్యవసాయ బోరు. వెళ్లి పలకరించాం. ‘‘కరెంటు వచ్చి గంటన్నర అయింది సారు. అందరు పట్టుకొని వెళ్లిపోయారు. ఊరంతటికి ఈ బోరే దిక్కు. గురువారం రాత్రి నుంచి నీళ్లకోసం బోరు వద్ద పడిగాపులు పడుతున్నం..’’ అని వారు చెప్పారు. అక్కడ్నుంచి లింగాపూర్‌కు చేరాం. గొర్రెలకు నీళ్లు పెడుతున్న ఉప్పల నర్సింహులు కుటుంబాన్ని పలకరించాం. ఒకప్పుడు ఆయనది మోతుబరిగా బతికిన రైతు కుటుంబం. కరువుతో బోర్లు పోయి పంటలు ఎండిపోయాయి.

రోగాలతో గొర్రెలు చనిపోయి అప్పులపాలై అడ్డమీది కూలీలుగా బతుకుతున్నారు. ఆయనను మాట్లాడిస్తే... ‘‘80 జీవాలుండె. రెండున్నరెకరాల పొలం. రెండు బోర్లు. మంచిగ బతికిన సారూ. కరువుతోటి రెండు బోర్లు పోయినయి. లచ్చ (లక్ష) పెట్టి మళ్ల రెండు బోర్లు ఏపిచ్చిన. ఫాయిదా (ఫలితం) లేదు బిడ్డా. ఏదో అడ్డమైన రోగమొచ్చి 50 జీవాలు సచ్చిపోయి రెండు లక్షలు నష్టపోయినం. గిన్ని బాధలు పెట్టుకుని పండుగెట్ల చేసుకోవాలే బిడ్డా..’’ అని ఆవేదనతో చెప్పాడు. ఇదే గ్రామంలో కూలిపోయిన ఓ ఇంట్లో ఉంటున్న బోయిని పోచయ్యను పలకరిస్తే.. ‘‘12 పశువులు ఉండె. వాటికి గడ్డి పెట్టలేక ఆరింటిని అమ్మిన. ఉన్నయి కూడా అమ్మక తప్పేట్టు లేదు. కాలం లేక పనులు దొరకక పూట గడుస్తలేదు. కూలిన ఇంటికి కప్పేయించలేక పోయిన. ఇంక పండుగ ఏం జేత్తాం..’’ అని మొరపెట్టుకున్నాడు.
 
 ఖాళీ బిందెలతో జనం రాస్తారోకో..
 లింగాపూర్ నుంచి తూప్రాన్ మండల కేంద్రం మీదుగా పోతరాజుపల్లి చేరుకున్నాం. ఊరు జనం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. మేం వెళ్లేటప్పటికే అరగంట నుంచి రాస్తారోకో చేస్తున్నారు. వారిని మాట్లాడించగా.. ‘‘మా గ్రామంల తాగునీళ్లకు ఇబ్బంది ఉంది. సర్పంచికి చెప్పి చెప్పి పానం పటమారిపోయింది. బిందెడు నీళ్ల కోసం రోడ్డు మీదకొచ్చినం..’’ అని మల్లేశ్ అనే గ్రామస్తుడు చెప్పారు. ‘‘తాగునీటి కోసం రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నం. నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలె. సారూ..’’ అని కవిత అనే మహిళ వాపోయింది. ‘‘పండుగపూట నైనా నీళ్లు ఇస్తారనుకుంటే పట్టించుకునేవారే లేరు. మా  సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి’’ అని  యశోధ అనే మరో మహిళ ఆక్రోశం వ్యక్తం చేసింది.

 

 

 సీఎం నియోజకవర్గంలో ఇలా..
 పోతురాజుపల్లి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణానికి చేరుకున్నాం. ఎండ నడినెత్తి మీదకు వచ్చింది. పానం గావర గావర అవుతోంది. సద్ది కట్టుకొని వచ్చిన పెరుగన్నం ఆరగించి వార్తా సేకరణలో పడ్డాం. గజ్వేల్ మీదుగా దౌల్తాబాద్ మండలంలోకి ప్రవేశించాం. గజ్వేల్‌కు 8 కిలోమీటర్ల దూరంలోని ఆరెపల్లికి వెళ్లాం. రైతు కాశమైన భిక్షపతితో మాట కలిపాం. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. అదే జీవనాధారం. రెండు బోరుబావులు తవ్వించాడు. 800 ఫీట్ల వరకు వేసినా.. చుక్కనీరు రాలేదు. రూ. 2 లక్షల అప్పు అయింది. ఆశ చంపుకోలేక ఇంకో బోరు వేయించాడు. రూ.90 ఖర్చు అయింది. 2 ఇంచుల నీళ్లు పడ్డయి. బోరు మోటారు దింపడానికి పైసల్లేక భార్య వద్ద ఉన్న రెండు తులాల బంగారం అమ్మి రూ.50 వేలతో మోటారు తెచ్చి పెట్టాడు. ఆరు నెలలు ఆ బోరు కూడా ఆగిపోయింది. రూ.4 లక్షల అప్పు మిగిలింది.

పండుగ పూట ఆ కటుంబం కన్నీళ్లతోనే గడిపింది. వారి పిల్లలు సరిత, కరుణాకర్‌లను రాంసాగర్‌లోని ఆడపడుచు నర్సమ్మ వచ్చి తీసుకుపోయింది. ‘‘ఎదిగొచ్చిన కూతురుంది. దాని పెళ్ళి ఎట్ల చేయాలే...? చేసిన కష్టమంతా భూమిలో పోయే.. కాలమేమో గిట్లుండే’’... అంటూ ఆ దంపతులిద్దరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామంలో గ్రామ దేవతల ఆలయాల వద్ద బండ్లు, ట్రాక్టర్లను అలంకరించి ఊరేగింపు చేయటం కనిపించింది. ఈ గ్రామంలో ‘ఉగాది’ పెద్ద ఎత్తున జరుపుకుంటారట. కానీ ఈసారి కరువు దెబ్బకు చాలా తేడా కనిపిస్తోందని గ్రామస్తులు చెప్పారు. అదే రోడ్డు వెంట 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగారెడ్డిపల్లికి వెళ్లాం. అతుకుల రేకుల ఇంట్లో కాలం వెళ్లదీస్తున్న ఎల్లం-లక్ష్మీ దంపతులను పలకరిచంగా.. ‘‘మాకేం పండుగ బిడ్డా.. ఉంటానికే ఇళ్లు సక్కగలేదు’’ అంటూ సమాధానమిచ్చారు.
 
 నాకు పండుగ లేదు.. పబ్బం లేదు..
 తిమ్మక్కపల్లి గ్రామంలో కిచ్చుగారి శ్యామలను పలకరించాం. నిజానికి ఈమెది రాంసాగర్ గ్రామం. అక్కడ భర్త వెంకటయ్య గతేడాది వ్యవసాయంలో వరుస కష్టనష్టాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకునేనాటికి రూ.6 లక్షల అప్పులున్నాయి. అప్పులోళ్లు శ్యామలను వేధించారు. బాధ పెరగటంతో ఆమె. పుట్టినిల్లు తిమ్మక్కపల్లికి వచ్చి కొంత కాలంగా ఓ పెంకుటిల్లులో నెలకు రూ.300 అద్దెకు నివాసం ఉంటోంది. బీడీలు చుడుతూ, కూలీపనులకు వెళ్తూ... పిల్లల్ని సాకుతోంది. ఆమెను కదిలిస్తే ‘‘ఇయ్యాల అందరూ పండుగ జేసుకుంటుండ్రు.. నాకు పండుగ లేదు..పబ్బం లేదు..’. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
 
 నేనెట్టా పండుగ చేసుకోనే..?
 రాంసాగర్ మీదుగా దుబ్బాక మండలం బొప్పాపూర్‌కు చేరుకున్నాం. ఊరిలో పండగ కళ లేదు కాని ఏదో సందడి మాత్రం ఉంది. డప్పు సప్పుల్లతో ఊరు దద్దరిల్లుతోంది. వెళ్లి చూశాం.. రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఊరేగింపుగా వస్తున్నారు. మిషన్ కాకతీయ రెండో విడత కింద మంజూరైన చెరువులు, కుంటలకు శంకుస్థాపన చేస్తున్నారట. దగ్గరకు వెళ్లి పండగ చేశావా? అన్నా అని పలకరించాం.. ‘‘కరువు పాడుగాను.. జనం కరువుతో అల్లాడుతుంటే నేనెట్టా పండుగ చేసుకోనే..? ఊళ్లల్ల తిరుగుతే రైతులకు గుండె ధైర్యం అయినా ఉంటుందని ఇంత పచ్చడి తాగి ఇట్టబడి వచ్చిన... తొందరలోనే గోదావరి నీళ్లు వస్తున్నయి. గోదారమ్మ మా ఊళ్లకు వచ్చిన తర్వాత నీళ్ల పండుగ చేస్తాం. మీ పేపరోళ్లను కూడా పిలుస్తాం. అందరు పండగకు రావాలే..’’ అని ముందస్తు ఆహ్వానం పలికారు. ఇక్కడ్నుంచి సిద్దిపేటకు చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం 6 గంటలు అయింది. పట్టణంలో జనం సాధారణ పనుల్లో బిజీబిజీగా కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement