సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ
రాజేంద్రనగర్ : వివిధ పంటలలో అధిక దిగుబడి సాధించడానికి అనుసరించల్సిన సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వరి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన 32 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా వరిలో యాంత్రీకరణను ప్రోత్సహించడానకి, మిషన్ నాట్లకు అనువుగా పాలిథిన్ షీటుపై నారు పెంచే పద్ధతిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.
సమీకృతి వ్యవసాయం, వ్యవసాయంలో అందుబాటులో ఉన్న పనిముట్లుపై అవగాహన కల్పించారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలలో ఖర్చు తగ్గించుకొని నికర ఆదాయం పెంచడానికి ఉన్న యాజమాన్య పద్ధతులను, తెగుళ్ల నివారణకు పాటించవలసిన పద్ధతులను, అడవిపందులు, కోతులు తదితర వాటి నుంచి పంటలను కాపాడుకోవడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించారు.
వాతావరణ ఆధారిత పంటలు–పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, శాస్త్రవేత్తలు డాక్టర్ పద్మ, డాక్టర్ దామోదర్‌రాజు, స్పందన, శ్రీలత, వాసుదేవరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment