సాంకేతికతతోనే సత్ఫలితాలు
సాంకేతికతతోనే సత్ఫలితాలు
Published Tue, Dec 13 2016 11:46 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
–రిలయన్స్ పౌండేషన్ సదస్సులో జేడీఏ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ రైతులకు చేరవేసినపుడే మంచి ఫలితాలు వస్తాయని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం డీవీఆర్ సమావేశ మందిరంలో రిలయన్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జేడీఏ పాల్గొని ప్రసంగించారు. సామాజిక బాధ్యత కింద రిలయన్స్ పౌండేషన్ రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా వ్యవసాయంలో వచ్చిన సాంకేతికత రైతులకు చేరితేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు రైతులకు వివిధ రూపాల్లో టెక్నాలజీని బదిలీ చేయవచ్చని వివరించారు. సంచార విజ్ఞాన వాహనాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు తదితర మార్గాల్లో తాజా పరిణామాలను రైతులకు వివరించాలన్నారు. వచ్చే నెల రోజుల్లో ఏమి చేయాలో కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేయాలన్నారు. గులాబి రంగు పురుగుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని, తగిన ముందు జాగ్రత్తల వల్ల దీనిని నివారించుకునే అవకాశం ఉందన్నారు. రిలయన్స్ పౌండేషన్ రాష్ట్ర సమన్వయకర్త చిట్టిబాబు మాట్లాడుతూ. రిలయన్స్ సామాజిక బాధ్యత కింద రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. టెక్నాలజీని రైతులకు బదిలీ చేస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. వివిధ శాఖల అధికారులు కూడా తమ శాఖ ద్వారా రైతులకు ఎప్పటికపుడు సమాచారాన్ని చేరవేసి అధికోత్పత్తి సాధించడానికి సహకరిస్తామన్నారు. సమావేశంలో డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ సుజాతమ్మ, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నరసింహుడు, పశుసంవర్ధకశాఖ ఆదోని ఏడీ రమణయ్య, కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్‌రెడ్డి, రిలయన్స్ పౌండేషన్ జిల్లా మేనేజర్ ఎం.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement