యంత్రాలకు దూరం
- వ్యవసాయ పరికరాల కొనుగోలుపై రైతుల అనాసక్తి
- అధికారుల అమ్మకం లక్ష్యం రూ.8.19 కోట్లు
- రైతులు కొనుగోలు చేసింది రూ.1.24 కోట్లే
- {పత్యామ్నాయాలపై ప్రతిపాదనలు పంపిన అధికారులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో యంత్రాలతో సాగు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతోంది. ఆధునిక వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమైనా, రైతులూ వీటి వినియోగంపై ఆసక్తి చూపడంలేదు. దీంతో జిల్లాలో యాంత్రీకరణ లక్ష్యం నీరుగారుతోంది. ఈ ఏడాది రూ.8.19 కోట్లు విలువైన యంత్రాలు రాయితీపై అమ్మాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కేవలం రూ.1.24 కోట్లు విలువైనవి మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. ఆదాయం కంటే పెట్టుబడి పెరిగిపోవడంతో ఆధునిక యంత్రాల కొనుగోలుపై అన్నదాతలు విముఖత కనబరుస్తున్నారు.
వ్యవసాయంలో సాగు ఖర్చును, రైతుల శ్రమను తగ్గంచడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆధునిక సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆధునిక పరికరాలను రాయితీపై రైతులకు అందిస్తోంది. రోటా వేటర్లు, కలుపు తీసే పరికరాలు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, పెద్ద ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను 30 నుంచి 50 శాతం రాయితీపై ఇస్తోంది.
ఆసక్తి చూపించని రైతులు
జిల్లాలో ఆధునిక యంత్రాల వినియోగం ఆశించిన స్థాయిలో లేదు.
జిల్లాలో అత్యధిక శాతం కమతాలు చిన్నవి. వీటిల్లో భారీ యంత్రాలను వినియోగించే పరిస్థితి లేదు.
కొద్దిపాటి విస్తీర్ణంగా సాగుకు పరికరాలను కొనుగోలు అదనపు భారంగా రైతులు భావిస్తున్నారు.
మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. బ్యాంకుల రుణాలు చెల్లించలేని దుస్థితి.
ఈ పరిస్థితుల్లో సనాతన విధానంలో సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు
ప్రభుత్వం సబ్సిడీపై ఆధునిక పరికరాలను అందజేస్తున్నా.. కొనుగోలుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి వస్తుందో రాదోనని యంత్రాల కొనుగోలుకు అదనంగా ఖర్చుకు రైతులు వెనకాడుతున్నారు.
అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం ప్రాంతాలో రైతులు కొద్ది పాటి మంది వీటిపై దృష్టి సారిస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాల అవసరాలపై వ్యవసాయాధికారులు రైతుల్లో కలిగించే చైతన్యం నామమాత్రం.
ఈ ఏడాది రాయితీతీపై వ్యవసాయ పరికరాల అమ్మకం లక్ష్యం రూ.8.19 కోట్లు. ఇప్పటి వరకు 1942 మంది రైతులు మాత్రమే కేవలం రూ.1.24 కోట్లు విలువైన యంత్రాలు కొనుగోలు చేశారు.
ఇదే పరిస్థితిని వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. చిన్న కమతాలకు అనువైన పరికరాలను తక్కువ ధరకు సబ్సిడీతో అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న ప్రతిపాదించారు.