విషాదయాత్ర! | medical student dies in road accident | Sakshi
Sakshi News home page

విషాదయాత్ర!

Published Sun, Sep 17 2017 10:43 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

విషాదయాత్ర! - Sakshi

విషాదయాత్ర!

- రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి
– స్నేహితులతో కలిసి పెనకచెర్ల డ్యాంకు వెళ్తుండగా ఘటన
– విషాదంలో వైద్యులు, మెడికల్‌ విద్యార్థులు
– కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు


అనంతపురం మెడికల్‌/గార్లదిన్నె: విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిదండ్రుల ఆశలను అడియాస చేసింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఓ మెడికోను తిరిగిరాని లోకాలకు చేర్చింది. ఈ ఘటనతో వైద్య విద్యార్థులు, డాక్టర్లు విషాదంలో మునిగిపోయారు.

అనంతపురం సర్వజనాస్పత్రిలో కంటి వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ సైదన్న కుమారుడు ప్రణీత్‌ (25) అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం అభ్యసిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గార్లదిన్నె మండలం పెనకచెర్ల డ్యాంకు విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. గార్లదిన్నె మండలం యర్రగుంట్ల సమీపంలోని పిల్ల కాలువ వద్దకు రాగానే ప్రణీత్, అతడి స్నేహితుడు కలిసి వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పింది. వారిద్దరూ కింద పడిపోగానే వెనుకే వస్తున్న లారీ ప్రణీత్‌ను ఈడ్చుకుంటూ వెళ్లింది. వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

విషాదంలో వైద్యులు, విద్యార్థులు :
ప్రణీత్‌ తండ్రి సైదన్న, తల్లి ఇందిర ఇద్దరూ వైద్యులే. కుమారుడు ఎంబీబీఎస్‌ చేస్తుండగా కుమార్తె ఇంటర్‌ చదువుతోంది. ప్రమాద విషయం తెలియగానే ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రణీత్‌తో కలిసి చదువుతున్న విద్యార్థులు బోరున విలపించడం అక్కడున్న వారి హృదయాలను కలచి వేసింది. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఆర్‌ఎంఓలు విజయమ్మ, జమాల్‌బాషా, డాక్టర్‌ శివకుమార్, డాక్టర్‌ ఆత్మారాం తదితరులు సైదన్నను ఓదార్చారు. చేతికొచ్చిన కుమారుడు అర్థంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ డాక్టర్‌ సైదన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement