ఎంసెట్, ప్రైవేటు ప్రవేశ పరీక్షలపై ‘నీట్’ ప్రభావం
మెడిసిన్, బీడీఎస్‌కు పరీక్ష లేదన్న కేఎల్‌ఈ నిర్వాహకులు
పరీక్షకు గంట ముందు చెప్పడంతో కంగుతిన్న విద్యార్థులు
నిరాశగా వెనుదిరిగిన పలువురు అభ్యర్థులు
రూ.వేలల్లో ఫీజులు చెల్లించామని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన
నేడు జరగాల్సిన కా-మెడిక్ పరీక్ష రద్దని అభ్యర్థులకు మెస్సేజ్‌లు
సాక్షి, విజయవాడ బ్యూరో: వైద్య వృత్తిని చేపట్టాలనే లక్ష్యంతో రాత్రిపగలు కష్టపడి చదివి తీరా పరీక్షలు రాసి సీటు సాధించేందుకు సిద్ధమైన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఎంబీబీఎస్ ఎలిజిబుల్ ఎంట్రన్స్ టెస్ట్‌పై నెలకొన్న గందరగోళం దీనికి కారణమవుతోంది. ఏపీలో విజయవాడ కేంద్రంగా శనివారం జరిగిన కేఎల్‌ఈ(కర్ణాటక) యూనివర్సిటీ మెడిసిన్ ఎలిజిబుల్ టెస్ట్ దీనికి నిదర్శనం. పరీక్ష కేంద్రానికి వివిధ ప్రాంతాలనుంచి చేరుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
‘నీట్ జరపాలా? వద్దా? అనే విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు తీర్పు మేరకు ఈ నెల 9 తరువాత నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుత పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్ అభ్యర్థులకు వర్తించదని, కేవలం ఏజీబీఎస్సీ, ఫార్మసీ కోర్సులకు మాత్రమే’ అనే నోటీసుబోర్డు చూసి కంగుతిన్నారు. దేశంలో మంచి గుర్తింపు కలిగిన వర్సిటీల్లో ఒకటైన కేఎల్‌ఈ మెడిసిన్ ఎలిజిబుల్ టెస్ట్ కోసం దాదాపు 500మందికిపై తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిండ్రుల్లో గందరగోళం నెలకొంది.
సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చిన పలు సంకేతాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉదయం 11గంటలకు కేఎల్‌ఈ వెబ్‌సైట్‌లో ప్రస్తావించారు. మరోవైపు ఆదివారం జరగాల్సిన కా-మెడిక్ ప్రవేశపరీక్ష రద్దయినట్లు అభ్యర్థులకు నిర్వాహకులు మెసేజ్‌లు పంపారు. మొత్తానికి ఈ ఏడాది మెడిసిన్ విద్యార్థులు ఎంసెట్, నీట్ టెన్షన్‌తో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
ఏపీ ఎంసెట్ సరే.. మిగిలినవాటి మాటేంటి
ఏపీ ఎంసెట్‌కు మినహాయింపు ఉంటుందని సంకేతాలొచ్చినా నీట్ ఉంటే ఏ రాష్ట్రంలోను యాజ మాన్య కోటా సీట్ల భర్తీకి ఆయా కళాశాల యజమాన్యాలు సొంతంగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో ఏపీ ఎంసెట్‌లో సీటు రాకుంటే ఏదో ఒక రాష్ట్రంలో బి కేటగిరి సీటు సంపాదించాలన్న తాపత్రయంతో వేల రూపాయలు ఎంట్రన్స్ టెస్ట్‌లకు చెల్లించిన విద్యార్థులు ప్రస్తుత గందరగోళ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. శనివారం అక్కరకు రాకుండాపోయిన కేఎల్‌ఈ పరీక్షకు రూ.2వేలు, అలాగే కా-మెడిక్‌కు రూ.2 వేల కుపైగా చెల్లించారు. ఇలా ఒక్కో విద్యార్థి పలు రాష్ట్రాల్లో మెడిసిన్ ఎలిజిబుల్ ఎంట్రన్స్ టెస్ట్‌ల కోసం రూ.12 వేల నుంచి 25 వేలపైగా చెల్లించారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించకపోతే ఫీజు వాపసు వస్తుందా? లేదా ? అనేది అనుమానమే.
ముందుగానే సమాచారం ఇవ్వకపోవడంతో ఇబ్బందులు
మేం ఖమ్మం నుంచి ఇక్కడికి ఎంబీబీఎస్, బీడీఎస్ పరీక్ష రాయడానికి వచ్చాం. మరో గంటలో పరీక్ష అనగా నిర్వాహకులు ఎంబీ బీఎస్, బీడీఎస్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష లేదని తిరిగి పంపించేస్తున్నారు. ముందస్తు సమాచారమివ్వకుండా ఇలా చేయడం దారుణం. మళ్లీ పరీక్ష పెడతారో లేదో, ఫీజులు తిరిగి ఇస్తారో ఇవ్వరో సమాచారం లేదు.
-మనీషా సింగ్, మాధురి, ఖమ్మం, తెలంగాణ
విద్యార్థుల భవిష్యత్తు నాశనం..
పరీక్షకు మరో గంట ఉందనగా ఎంబీబీఎస్, బీడీఎస్ అభ్యర్థులు ఎంట్రన్స్ టెస్టుకు అనర్హులనడం దారుణం. నీట్‌పై ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోంది. కొందరు విద్యార్థుల్ని పంపేసి నిర్వహించే ఈ పరీక్షనే తర్వా త ప్రామాణికంగా తీసుకుని వర్సిటీ ఇదే అర్హత పరీ క్షపై అడ్మిషనిస్తామంటే అప్పుడు వారి పరిస్థితేంటి?.
-పెనుమాల రాంబాబు, న్యాయవాది, విజయవాడ
యూనివర్సిటీదే బాధ్యత..
విద్యార్థి అర్హత పరీక్షపై ముందుగానే సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే పరీక్ష రాయడానికి దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తీవ్ర నిరాశ చెందుతారు. అయితే యూనివర్సిటీ కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది. విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం యూనివర్సిటీకి ఉంది.
- రాజు, విద్యార్థిని తండ్రి, చత్తీస్‌గఢ్
మానసిక ఒత్తిడిలో మెడికల్ అభ్యర్థులు
Published Sun, May 8 2016 7:57 PM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement